ఏపీకి వెళ్లే వారికి ముఖ్య గమనిక, ఈ-పాస్ ఉంటేనే అనుమతి

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 01:55 PM IST
ఏపీకి వెళ్లే వారికి ముఖ్య గమనిక, ఈ-పాస్ ఉంటేనే అనుమతి

Updated On : July 2, 2020 / 3:14 PM IST

హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగింది. సరిహద్దుల్లోని పొందుగుల, గరకిపాడు చెక్ పోస్టుల దగ్గర కూడా భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి.

పాసులుంటేనే అనుమతి, ఉ.7 నుంచి రా.7 వరకే:
అయితే స్పందన పాసులు(ఈ-పాస్) ఉంటేనే పోలీసులు ఏపీలోకి అనుమతిస్తున్నారు. పాసులు లేని వాళ్లను వెనక్కి పంపేస్తున్నారు. దీంతో పాసులు లేనివారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఏపీలోకి అనుమతించడానికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను ఏపీలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. రాత్రి 7 తర్వాత ఎమర్జెన్సీ అయితేనే అనుమతిస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్?
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి మరింత కఠినంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని, బయటకు వెళ్లడానికి రెండు గంటలు మాత్రమే టైం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 15 రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేయడం ఖాయమని సంకేతాలు అందడంతో నగరంలో ఉంటున్న ఏపీ వాసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉండటం తమ వల్ల కాదని భావిస్తున్న వారు సొంతూళ్లకు పయనం అవుతున్నారు.

lock down in hyderabad

నగరంలో బతకు బరువై సొంతూళ్లకు పయనం:
తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇంతకు ముందు విధించిన లాక్‌డౌన్, ఇటీవల హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండటంతో నగరంలో చాలా మంది గత మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇరుకు ఇళ్లలో పిల్లలతో కలిసి ఉండటం ఇబ్బందిగా ఉండటం.. నగరం కంటే పల్లెటూళ్లే సేఫ్ అనే భావనతో చాలా మంది తమ ఊళ్లకు వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. చాలామంది కార్లు, బైక్‌లు, ఆటోల్లోనూ ప్రయాణం చేస్తున్నారు. స్వయం ఉపాధి పొందే వారు, కూలి పనులు చేసుకునే వారు లాక్‌డౌన్ కారణంగా చాలా అవస్థలు పడ్డారు. ఆదాయం లేకపోవడం, ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడ్డారు. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే.. నగరంలో బతుకు దుర్భరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసేందుకు పనిలేక, తినడానికి తిండిలేక, ఇంటి నెలవారీ అద్దె చెల్లించలేక తట్టా బుట్టా సర్దుకుని స్వగ్రామాలకు బయలు దేరారు జనం. ఈ క్రమంలో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సాధారణంగా సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలో జాతీయ రహదారులు, టోల్ గేట్ల దగ్గర ఇలాంటి రద్దీ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ భయం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

 

Read:ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా