Kodali Nani: కొడాలి నాని, మరో ఇద్దరు నేతలకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. ఎందుకంటే?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది..

Kodali Nani: కొడాలి నాని, మరో ఇద్దరు నేతలకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. ఎందుకంటే?

Kodali Nani

Updated On : September 13, 2023 / 10:03 AM IST

Kodali Nani and Vangaveeti Radha: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకు పంపించిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో 2015 సంవత్సరంలో నమోదైన కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కొడాలి నానితో పాటు మాజీ మంత్రి పార్థసారథి, వంగవీటి రాధాకుసైతం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారిస్తున్న విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఎన్‌బీడబ్ల్యూలను జారీ చేస్తూ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

YS Jagan : చంద్రబాబు అరెస్ట్.. అకస్మాత్తుగా ఢిల్లీకి సీఎం జగన్, అందుకేనా? ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

2015 ఆగస్టు 29న ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా అప్పట్లో వైఎస్ఆర్ సీపీ నేతలు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే, ఈ ఆందోళనకు సంబంధించి కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో 55 మందిపై కేసు నమోదైంది. ఇందులో ఏ1గా పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధా పేర్లతో పాటు మరో 52 మంది నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అప్పట్లో ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.

Bandi Sanjay: చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో..: బండి సంజయ్

ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. మంగళవారం విచారణలో భాగంగా వీరు హాజరుకావాల్సి ఉంది. కానీ వారు హాజరుకాకపోవడంతో న్యాయాధికారి వీరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయితే, కేసును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.