AP Inter Admissions : ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు..!

ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది.

AP Inter Admissions : ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు..!

Now Ap Inter First Year Admissions To Be Applied Online

Updated On : July 13, 2021 / 10:05 AM IST

AP Inter Admissions : ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో అందర్ని పాస్ చేశారు. ఆ తరువాత తరగతులకు విద్యార్థులను ఎలా అనుమతించాలి అనేదానిపై కసరత్తు చేస్తోంది. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు పూర్తి చేసింది. పారదర్శకతతో మెరిట్‌ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కాలేజీలలో, నచ్చిన గ్రూపులో సీటు పొందేలా వీలు కల్పించనుంది.

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే ప్రారంభించింది. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్‌ కావడంతో ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్‌ బోర్డు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ అప్లికేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానంలో ఇంటర్‌ బోర్డు.. విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పించింది. గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, కులం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, చదివిన స్కూల్, ఆధార్‌ నంబర్ల వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్‌ ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌ లో అడ్మిషన్ కోసం అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.