అవినీతిపై పోరాటం చేశాడు..చివరకు అంతమొందించారు

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 11:49 AM IST
అవినీతిపై పోరాటం చేశాడు..చివరకు అంతమొందించారు

Updated On : November 14, 2020 / 12:05 PM IST

Opponents who killed Guru Pratap Reddy : ఆర్మీ మాజీ ఉద్యోగి గురుప్రతాప్‌రెడ్డి హత్య కేసు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 13మందిని కొండాపురం సర్కిల్‌లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గురుప్రతాప్‌రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే ప్రత్యర్థులు హత్య చేసినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సినిమాను తలపించేలా అవినీతిపై గురుప్రతాప్‌రెడ్డి పోరాటం చేశాడు. అనర్హులకు ముంపు పరిహారం ఇస్తున్నారని పోరాటం కొనసాగించాడు.



బి.అనంతపురం పరిహారం జాబితాలో బయట వ్యక్తులున్నట్లు గుర్తించిన గురుప్రతాప్‌రెడ్డి… విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బి.అనంతపురం గ్రామంలో మొత్తం 250 కుటుంబాలు ఉంటే.. అధికారులు 500 కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు నివేదిక సిద్ధం చేశారని తెలిపాడు. రూ.25కోట్లు అవినీతి జరుగుతోందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం వ్యవహారంపై అధికారులు విచారణ జరుపుతుండగానే.. ప్రత్యర్థులు దాడి చేసి గురుప్రతాప్‌రెడ్డిని హత్య చేశారు.



ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురుప్రతాప్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. శరీరంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.