Pawan Kalyan: NTTPS బూడిద కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ఫ్లై యాష్ కాలుష్య సమస్యపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)దృష్టి.
Pawan Kalyan takes a serious view of NTTPS fly ash pollution in Ibrahimpatnam
- ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై పవన్ ఫోకస్.
- ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన.
- జెన్కో అధికారులతో చర్చిస్తానని హామీ.
Pawan Kalyan: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా. NTTPS) నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ (బూడిద) కాలుష్య సమస్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)దృష్టికి వెళ్లింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జనసేన నాయకుడు అక్కల గాంధీ ఈ తీవ్రమైన సమస్యను ఆయనకు వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ పర్యటనలో భాగంగా వచ్చిన డిప్యూటీ సీఎంను కలిసి, బూడిద కాలుష్యంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నరకాన్ని కళ్లకు కట్టారు.
ఈ కాలుష్యం కారణంగా పరిసర గ్రామాల్లోని పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతింటున్నాయని నాయకులు వివరించారు. దీనిపై పవన్ కల్యాణ్ సుమారు అరగంట పాటు స్థానిక ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ నుంచి వచ్చే బూడిద వల్ల చెట్లు, పంటలు, పశువులు సైతం ప్రభావితమవుతున్నాయని, గాలి పూర్తిగా కలుషితమై శ్వాసకోస వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు చాలా కాలంగా ఆవేదన చెందుతున్నారు.
ఈ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్, వెంటనే స్పందిస్తూ ఏపీ జెన్కో (APGENCO) ఉన్నతాధికారులతో మాట్లాడి కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తానని ఆయన స్పష్టం చేశారు.
