నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో చంద్రబాబు ఏం చేస్తున్నారో గమనించి దాన్ని ఫాలో అయ్యాను: మోదీ
"సాంకేతికత గురించి మాట్లాడుతూ చంద్రబాబు నన్ను పొగిడారు.. కానీ, రహస్యం ఏమిటంటే నేను చంద్రబాబును ఫాలో అయ్యాను" అని మోదీ చెప్పారు.

Pm modi
అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో ఇక్కడి ప్రజలను కలవడం ఆనందంగా ఉందని మోదీ చెప్పారు. “మీ అందరిని కలవడం ఆనందంగా ఉంది” అని తెలుగులో అన్నారు.
“సాంకేతికత గురించి మాట్లాడుతూ చంద్రబాబు నన్ను పొగిడారు.. కానీ, రహస్యం ఏమిటంటే నేను చంద్రబాబును ఫాలో అయ్యాను. గుజరాత్ సీఎంగా ఉన్నపుడు ఏపీలో చంద్రబాబు ఏం చేస్తున్నారు అని గమనించి దాన్ని అనుసరించాను” అని చెప్పారు.
తాను పుణ్యభూమి అమరావతిలో ఉన్నానని మోదీ తెలిపారు. రాజధాని స్వప్నం సాకారం కాబోతుందని చెప్పారు. ఇది కేవలం శంకుస్థాపన కాదని, ఏపీ ప్రగతి, వికసిత్ భారత్‌కు నిదర్శనమని తెలిపారు. దాదాపు రూ.60 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశానని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతున్నానని మోదీ చెప్పారు.
“అమరావతిలాంటి పుణ్య భూమిపై నిల్చుంటే నాకు ఓ ప్రగతి నగరం కనిపిస్తోంది. వికసిత భారత్ కు చెందిన నమూనా కనిపిస్తుంది. అమరావతి నగరం నిర్మాణం అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. దేశానికి బలమైన పునాదులు ఇవి. అమరావతి అంటే ఇంద్రలోక దేవనగరి అని విన్నాం.
ఈ అమరావతి నగరం స్వర్ణాంధ్ర కు ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను అధునాతనంగా అపూర్వంగా మార్చే నగరం ఇది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, లాంటి రంగాల్లో అమరావతి ఓ లీడింగ్ నగరంగా మారుతుంది. ఇలా మార్చడంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. ఏపీలోని ప్రతి యువకుడికి ఉద్యోగాలు అందించే ఓ ప్రధాన కేంద్రం అవుతుంది” అని మోదీ తెలిపారు.