Vijayawada : రాహుల్‌ను హత్య చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణ
విజయవాడ కారులో మృత దేహం కేసు కీలక మలుపు తిరిగింది. రాహుల్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Vijayawada Car
Dead body in car : విజయవాడ కారులో మృత దేహం కేసు కీలక మలుపు తిరిగింది. రాహుల్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాహుల్ కారులో తాడు, తలదిండు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నారు. ఈ కేసులో ఓ ఫైనాన్స్ వ్యాపారి హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాహుల్ సెల్‌ఫోన్, పర్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు.
నిన్న రాత్రి ఏడున్నరకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన రాహుల్.. చెప్పిన టైమ్‌కి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. డీవీ మేనర్ ప్రాంతంలో కారులో రాహుల్ మృతదేహాన్ని కనుగొన్నారు.
నిన్న రాత్రి ఏడున్నర గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్లాడు రాహుల్. గంటలో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన రాహుల్ ఎక్కడికి వెళ్లాడు? నిన్న ఎవరెవరిని కలిశాడు? ఎవరితో ఫోన్ మాట్లాడాడు? అనే విషయాలపై పోలీసులు దృష్టిపెట్టారు.
తాడిగడపకు చెందిన కరణం రాహుల్.. జి.కొండూరులో గ్యాస్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీ రన్ చేస్తున్నాడు. అయితే.. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే జి.కొండూరు నుంచి విజయవాడ వచ్చాడా? లేదా ఎవరైనా మాట్లాడదామని పిలిపించారా? అసలు కారులో ఎంతమంది ఉన్నారు? నిన్న రాత్రి తొమ్మిది గంటలకు కారును పార్క్ చేసే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే ప్రశ్నలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
రాహుల్ కారుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కారు నీట్‌గా పార్క్ చేసి ఉంది. కానీ.. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న రాహుల్.. వెనక్కి పడిపోయిన ఉండటం అనుమానాస్పదంగా మారింది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్నవారికి గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కారు కంట్రోల్ కాదు.. అలాంటి టైమ్‌లో.. కారుకు ప్రమాదం తప్పదు. అయితే.. ఇక్కడ అలాంటి సీన్ ఏమీ లేదు.
రాహుల్ కాల్‌డేటాపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాహుల్ ఫోన్ నెంబర్ ఆధారంగా.. మృతుడు చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు? ఎక్కువసార్లు ఎవరికి ఫోన్ చేశాడనే వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా బండి ఎక్కడక్కడ తిరిగింది.. ఏఏ ప్రాంతాల్లో ఆగిందనే వాటిపై ఆరా తీస్తున్నారు.
నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోనే రాహుల్ డీవీ మేనర్ సందులోకి వచ్చినట్లు చెప్తున్నారు స్థానిక అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్లు. ఉదయం ఏడున్నర గంటలకు కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే.. రాత్రి షిఫ్ట్‌లో వేరే వ్యాచ్‌మెన్ ఉండటంతో.. అతడ్ని సైతం విచారించనున్నారు పోలీసులు. రాత్రి సరిగ్గా ఏ టైమ్‌లో కారు అక్కడికి వచ్చింది? కారులో ఎవరెవరు వచ్చారు? అక్కడ ఏమైనా ఘర్షణ జరిగిందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.