Prepaid Electricity Meters : ఏపీలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Prepaid Electricity Meters In Ap
Prepaid Electricity Meters in Ap : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ (ముందే బిల్లు చెల్లించే) విద్యుత్ మీటర్లు బిగించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర అభయాన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది(2022) మార్చి కల్లా ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఉత్తర్వుల్లో తెలిపారు.
ప్రస్తుత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లను డిస్కమ్‌లు ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతి నెల రెండు శాతం చొప్పున విద్యుత్ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు.. పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థల కార్యాలన్నింటికీ ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చనున్నారు. ఈ ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లకయ్యే ఖర్చును ఆయా కార్యాలయాల నుంచి రాబట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ అభియాన్ నుంచి రెండో విడత నిధులు పొందాలంటే 2022 మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు తప్పనిసరి.