Pulivendula: జడ్పీటీసీ ఉపఎన్నికల వేళ.. పులివెందులలో టెన్షన్ టెన్షన్.. బరిలో నిలిచింది వీరే..

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Pulivendula: జడ్పీటీసీ ఉపఎన్నికల వేళ.. పులివెందులలో టెన్షన్ టెన్షన్.. బరిలో నిలిచింది వీరే..

Updated On : August 6, 2025 / 1:32 PM IST

Pulivendula Tensions: పులివెందుల రాజకీయం హీటెక్కింది. జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. మంగళవారం వైసీపీ నేత అమరేశ్వర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో పులివెందులలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

వైసీపీ నేతపై దాడికి పాల్పడింది టీడీపీ నేతలేనంటూ ఆపార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ నేత, పులివెందుల పార్టీ ఇంచార్జి బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. సొంతపార్టీ నేతలపై వారే దాడికి పాల్పడి తమపై నెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ నేతపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్నఆ పార్టీ నేతలు సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు.. జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలపై బైండోవర్ కేసులు పెడుతున్నారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, స్థానిక నేతలు చేరుకొని నిరసన తెలిపారు.

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఈసారి ప్రధాన రాజకీయ పార్టీల సహా 11మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్‌రెడ్డితోపాటు మరో ఎనిమిది మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.

ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం నుంచి 11 మంది బరిలో నిలిచారు. టీడీపీ తరపున ముద్దుకృష్ణరెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ తరపున పూల విజయ్ భాస్కర్ బరిలో ఉన్నారు. అయితే, వైసీపీ తరపున నామినేషన్ వేసిన టక్కోలి శివారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వీరితోపాటు సౌమిత్రి చంద్రనాథ్‌, కోనేటి హరి వెంకటరమణ, గుండు మల్లికార్జునరెడ్డి, నడివీధి సుధాకర్‌, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేష్‌ నంద్యాల స్వతంత్య అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

రెండు జడ్పీటీసీ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కడప జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.