BREAKING NEWS : రాజమండ్రిని 4వ రాజధాని చేయాలి – మంత్రి రంగనాధరాజు

ఏపీలో మూడు రాజధానులు అంశం వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలతో అట్టుడుకిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రిని 4వ రాజధాని చేయాలని వ్యాఖ్యానించారు. సాంస్కృతిక రాజధాని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతానన్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించడం చాలా కష్టమని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో రాజధానిని నిర్మించాలంటే..లక్షా ఐదు వేల కోట్ల ఖర్చవుతుందని..ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
తలకోమాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి చిన రాజప్ప విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలనే ఉద్దేశ్యం సీఎం జగన్‌లో ఉందని, జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. వైజాగ్‌లో భూములు కొనుక్కొన్నారని, దీని వాల్యూ పెంచుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు.
ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతుల నినాదాలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనలో భాగంగా ఇవాళ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టిన మహిళలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read More : రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి..పెద్దన్న పాత్ర పోషించాలి – పవన్