Ram Gopal Varma : ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ, 9 గంటల పాటు ప్రశ్నల వర్షం.. విజయ్ పాల్ పందాలోనే ఆర్జీవీ..
కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

Ram Gopal Varma : సోషల్ మీడియా పోస్టుల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణ ముగిసింది. సుమారు 9 గంటల పాటు వర్మను పోలీసులు విచారించారు. అనంతరం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ నుండి వర్మ తన కారులో వెళ్లిపోయారు. విచారణ అధికారి రూరల్ సీఐ శ్రీకాంత్ ఆర్జీవీని ఎంక్వైరీ చేశారు. వర్మకు చెందిన ఒంగోలు లాయర్ ఎన్ శ్రీనివాస్ సమక్షంలో ఈ ఎంక్వైరీ జరిగింది.
మరోసారి విచారణకు వర్మ..
కాగా, విజయ్ పాల్ పందాలోనే ఆర్జీవీ వ్యవహరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఆయన సహకరించలేదని సమాచారం. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, తదుపరి డేట్ ను నోటీసుల ద్వారా తెలుపుతామని విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ బాబు వర్మకు తెలిపారు.
Also Read : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవా? తెలంగాణలో సరే.. ఏపీలో కూడా ఉండవా?
కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణ..
కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.
వర్మపై ప్రశ్నల వర్షం..
కూటమి నేతలపై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించారు. 100కు పైగా ప్రశ్నలకు వర్మ నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆర్జీవీ అంగీకరించినట్లు సమాచారం. తన ఎక్స్ ఖాతా నుంచే పోస్టులు పెట్టినట్లు వర్మ ఒప్పుకున్నారట. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి వర్మపై టీడీపీ కార్యకర్త గతంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వర్మపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు..
తమ పార్టీ నాయకులు, కుటుంబసభ్యులపై రాంగోపాల్ వర్మ అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41ఏ నోటీసులు జారీ చేశారు. తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్స్ లో వస్తే భారీగా నష్టపోతానంటూ ఆర్జీవీ తెలిపారు. తనకు వారం 10 రోజుల గడువు ఇవ్వాలంటూ నోటీసుల సమయంలో పోలీసులను కోరారు.
Also Read : శని ‘సడేసతి’ వస్తోంది.. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఏ పరిహారం చేయాలంటే?
ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. కానీ, వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై పోస్టులు పెట్టారు. పోలీసులు రెండు సార్లు అవకాశం కల్పించినా వర్మ విచారణకు రాలేదు.