rat catching in delta area : ఎలుకను పడితే 100రూ…ముచ్చెమటలు పట్టిస్తున్న మూషికాలు…
డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల్సి వస్తోంది.

Rat Catching In Delta Area For Saving Crops
rat catching in delta area : డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల్సి వస్తోంది.
పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 4.6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. గత నెల రోజులుగా పొలాల్లో మూషికాల బెడద పెరిగిపోయిన నేపథ్యంలో దాళ్వా పంటను రక్షించుకోవాలంటే ఇప్పుడు కచ్చితంగా నివారణ చేపట్టాల్సి ఉంటుంది.
దీనికోసం అధికశాతం రైతులు ప్రత్యేక బుట్టల ద్వారా ఎలుకలు పట్టేవారిపై ఆధారపడుతున్నారు. దాళ్వా సీజన్ ఆరంభంలో వీరికి ఒక్కో ఎలుకకు రూ.20 నుంచి 30 వరకు చెల్లించేవారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో క్రమంగా ఈ ధర రూ.50..70..80 వరకు చేరింది తాజాగా కొన్ని ప్రాంతాల్లో రూ.100 వరకు చెల్లిస్తే గానీ బుట్టలు అమర్చే కూలీలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎలుకల బుట్టలు అమర్చేవారు ఉండేవారు.
మారుతున్న కాలంతోపాటు ఈ వృత్తిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మిగిలిఉన్న కొద్దిమందిని దూరప్రాంతాల రైతులు కూడా తమ గ్రామాలకు రప్పించుకొని వారు అడిగినంత ఇచ్చి ఎలుకలు పట్టిస్తున్నారు. పాలకోడేరు, చుట్టుపక్కల మండలాల్లో రూ.70 వరకు, ఉండి మండలంలో రూ.100 చొప్పున బుట్టలు అమర్చే కూలీలు వసూలు చేస్తున్నట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు.
గత ఖరీఫ్ సీజన్‌లో అధిక వర్షాలు, వరదల ప్రభావంతో ఎలుకల సంఖ్య నాడు గణనీయంగా తగ్గినట్లు నిపుణులు గుర్తించారు. ఎలుకలు సహజంగా వరదలు, వర్షాల సమయాల్లో చెట్లు, భారీ వృక్షాలున్న ప్రాంతాలకు తరలిపోయి తన సంతతిని కాపాడుకుంటాయని చెబుతున్నారు. అప్పటికి వీటి బెడద తగ్గినట్లు కనిపించినా తర్వాతి సీజన్‌లో ఒక్కసారిగా విజృంభించి పంటలకు అపార నష్టాన్ని చేకూరుస్తాయని వ్యవసాయ నిపుణులు వివరిస్తున్నారు.
ప్రస్తుత రబీ సీజన్‌లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఫిబ్రవరిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ క్షేత్రాల్లోని బొరియలను గుర్తించి తొలిరోజు వాటిని పూర్తిగా మట్టితో మూసివేయాల్సి ఉంది. మరుసటి రోజు తెరచుకున్న బొరియలను గుర్తించి బ్రోమోడయోలిన్ మందు ఉంచుతారు. ఇదంతా సామూహికంగా జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ అమలులో చాలాచోట్ల సరైన పంథా అవలంబించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది.
ఈ ఏడాది ఎలుకల బెడద చాలా అధికంగా ఉంది. ఎర మందును ఎలుకలు సరిగా తినడంలేదు. కూలీలతో ఐదుసార్లు బుట్టలు పెట్టించాల్సి రావడంతో ఎకరానికి రూ.2,500 చొప్పున అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఒక్కో ఎలుకకు రూ.100 ఇచ్చినా ప్రస్తుతం ఆ వృత్తిదారులు దొరకడం లేదు. పంట ఈనిక, గింజ గట్టిపడే దశలో ఎలుకలు దాడి చేస్తే దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది సార్వా పంట దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాల్లో వరిచేలను ఖాళీగా వదిలేయడంతో ఇప్పుడు ఎలుకల బెడద ఎక్కువైంది. భీమవరం, వీరవాసరం, పాలకోడేరు మండలాల్లో ఫిబ్రవరిలో చేపట్టిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో 101 కిలోల బ్రోమోడయోలిన్ మందును రైతులకు పంపణీ చేశాం. రైతులంతా కలిసి సామూహికంగా నివారణ పద్ధతులు పాటిస్తేనే సత్ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు.