కర్నూలులో హైకోర్టు : సీమ ప్రజల కల నెరవేరబోతుందా?

  • Published By: sreehari ,Published On : December 17, 2019 / 02:57 PM IST
కర్నూలులో హైకోర్టు : సీమ ప్రజల కల నెరవేరబోతుందా?

Updated On : December 17, 2019 / 2:57 PM IST

రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాబోతోందా? ఎన్నో ఏళ్ల నాటి సీమ ప్రజల కల నెరవేరబోతుందా? అంటే అవునునే సంకేతాలు వినిపిస్తున్నాయి. సీమలో హైకోర్టు ఏర్పాటుపై జగన్ సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత సీమలో హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రాజధానిలో పరిపాలన, న్యాయపరమైన వ్యవహారాలు కూడా భాగమేనని తెలిపింది.

నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని వివరించింది సర్కార్. దీంతో సీమ ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని గురించి చర్చ జరుగుతోంది. హైకోర్టు ఏర్పాటుపై కర్నూలు జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమే జరగాలి:
రాయలసీమ ప్రజలు శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని, రాజధానిని, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. కొన్నాళ్లుగా కర్నూలులో హైకోర్టును లేదా బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ రాయలసీమకు చెందిన లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.

అంతేకాదు.. రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి యవజన సంఘాల నేతలు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఫ్లకార్డులు పట్టుకుని వీరంతా సచివాలయం ప్రాంగణంలోని ఆర్టీసీ బస్టాప్ నుంచి అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.

కర్నూలుకే హైకోర్టు రావాలి :
ఇదిలా ఉంటే.. కర్నూలులో పర్యటన తరువాత అనంతపురంలో పర్యటించిన కమిటీకి రాయలసీమ విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. కమిటీ సభ్యులు వెళ్తున్న సమయంలో వారి ఎదుట విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటంతో పాటు రాజధాని విషయంలో కూడా న్యాయం చేయాలని కమిటీని విద్యార్థి సంఘాలు కోరాయి.

సీఎం జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాజధాని అధ్యయనం కొరకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 14రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లా అధికారులకు కమిటీ చేసిన సూచనలను విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు రాజధాని లేదా హైకోర్టు వచ్చినా.. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం న్యాయంగా కర్నూలుకే రావాలని విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.