ఏపీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల…సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్

ఏపీ సర్కార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సెప్టెంబర్ 10,11 న ఐసెట్, 14న ఈసెట్, సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28, 29, 30న ఏపీజీ ఈసెట్ నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 1న ఎడ్ సెట్, అక్టోబర్ 2 నుంచి 5 వరకు లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏపీలో ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చాలా జాగ్రత్తగా, కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు.
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కామన్ ఎంట్రన్స్ టెస్టులన్నీంటిని ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీ సెట్ లాంటి 8 ప్రవేశ పరీక్షలన్నీంటిని వాయిదా వేశారు. సీఎం జగన్ ఆదేశాలతో 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అయితే ఇవాళ కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను విడుదల చేశారు.