ఆర్టీసీ డ్రైవర్లకు 8గంటలే విధులు

ఆర్టీసీ డ్రైవర్లకు 8గంటలే విధులు

Updated On : January 9, 2020 / 11:57 PM IST

ఆర్టీసీలో డ్రైవర్ల పనివేళలను అదుపులో ఉంచనున్నారు. 8 గంటలకు పైగా విధులు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సరైన విశ్రాంతి లేకుండా బస్సు నడపటంతో ప్రమాదాలు జరగడంతోపాటు, డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎం.ప్రతాప్‌ కీలక నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అదనంగా విధులు నిర్వహించేందుకు డ్రైవర్ల ప్రత్యేక అనుమతి ఉంటేనే ఒప్పుకోవాలని సూచించారు. 

* దూర ప్రాంతాలకు తిరిగే రూట్ బస్సులు పలు నియోజకవర్గ కేంద్రాల వరకు వెళ్తున్నాయి. వీటి కారణంగా డ్రైవర్లు ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందుకే జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన నగరాల వరకే దూర ప్రాంత బస్సులు నడపాలని భావిస్తున్నారు.
* కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వారిలో డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లోకి వెళ్లొచ్చంటూ సూచించారు. 
* ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఇకపై ఉండకూడదని, వాటిని ఉద్యోగ సంఘాలుగా మార్చుకోవాలని ఆదేశించారు.

40 శాతం ఛార్జీ తగ్గింపు
ఏపీఎస్‌ ఆర్టీసీ గతేడాది సంక్రాంతికి 2వేల 100 ప్రత్యేక బస్సులను నడపగా ఈసారి 4వేల 200కు పెంచారు. వీటిలో విధులు నిర్వహించేందుకు డ్రైవర్లు సరిపోకపోతే అర్హులైన బయటవారిని తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీ ఉంది. ఈ బస్సులు తిరుగు ప్రయాణమైనప్పుడు అందులో సాధారణ ఛార్జీ కంటే 40 శాతం తగ్గించనున్నారు.