Rahul Murder Case : రాహుల్‌ హత్య కేసు..తలపై కొట్టడంతో చిట్లిన మెదడు నరాలు.. కారులోనే ఉరేసి చంపారు

ఏపీలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్‌ అని పోలీసులు తేల్చారు.

Rahul Murder Case : రాహుల్‌ హత్య కేసు..తలపై కొట్టడంతో చిట్లిన మెదడు నరాలు.. కారులోనే ఉరేసి చంపారు

Rahul Murder Case

Updated On : August 26, 2021 / 12:14 PM IST

Rahul murder Sensational matters : ఏపీలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఈ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్‌ అని పోలీసులు తేల్చారు. అత్యంత దారుణంగా రాహుల్‌ను హత్య చేశారని దర్యాప్తులో తేలింది.. హత్యకు ముందు రాహుల్‌ను అత్యంత దారుణంగా కొట్టారని.. తలపై అనేకసార్లు కొట్టడంతో అతని మెదడు నరాలు కూడా చిట్లినట్టు గుర్తించారు. కారులోనే తాడుతో ఉరేసి చంపి… ఆ స్థానంలో మరొక తాడుని ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది..

పోలీసులకు సాక్ష్యాధారాలు దొరక్కుండా నిందితులు పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవహరించినట్టు తెలుస్తోంది.. రాహుల్‌ ఒక ఫోన్‌ మాయం చేయడం.. బినామీ పేర్లతో కొత్త ఫోన్లు, కొత్త సిమ్‌ కార్డులు తీసుకొని వినియోగించినట్టు ఇందులో భాగమనేనని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రెండు చోట్ల సెటిల్ మెంట్‌కి ప్రయత్నించారు.. అక్కడ మాట వినకపోవడంతో రాహుల్‌ని తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది.. రాహుల్ హత్యలో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు..

ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ ఒత్తిడి తీసుకొచ్చాడని పోలీసులు గుర్తించారు.. కోగంటి సమక్షంలో బలవంతంగా కంపెనీ షేర్లు మార్పిస్తూ పేపర్లపై సంతకాలు పెట్టించి.. అక్కడే రాహుల్‌ని మరోసారి దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది.. రాహుల్‌ని చంపేయాలని కోగంటి, కోరాడ తమ అనుచరులకు ఆదేశించారని.. వారి ఆదేశాలతో కారులోనే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

రాహుల్‌ మర్డర్‌ మిస్టరీని విజయవాడ పోలీసులు ఛేదిస్తున్నారు. రాహుల్‌ హత్యకు కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి కోగంటి సత్యం కుట్ర పన్నినట్టు పోలీసులు తేల్చారు. ఇదే విషయాన్ని కోగంటి సత్యం రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపర్చారు పోలీసులు. వాటా అమ్మే విషయంలో రాహుల్‌, విజయ్‌కుమార్‌ మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కోగంటి సత్యం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. చౌకగా కంపెనీని కొట్టేయాలని కోగంటి ప్రణాళిక రచించినట్టు తేల్చారు. నామమాత్రపు ధరకు కంపెనీని అమ్మేందుకు రాహుల్‌ అంగీకరించనందునే.. హత్యకు కుట్రపన్నినట్టు పోలీసులు నిర్ధారించారు.

జిక్సిన్‌ కంపెనీలో రాహుల్‌కు 40శాతం వాటా ఉండగా.. విజయ్‌కుమార్‌కు 30శాతం వాటాల ఉన్నాయి. బొబ్బా స్వామి కిరణ్‌, రాహుల్‌ చౌదరికి కలిపి మరో 30శాతం వాటాలు ఉన్నాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కోరాడ విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన విజయ్‌కుమార్‌ను.. అప్పులు ఇచ్చిన వారు వేధించడం మొదలు పెట్టారు. దీంతో జిక్సిన్‌ కంపెనీలో తాను పెట్టిన 30శాతం పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని రాహుల్‌ను విజయ్‌కుమార్‌ కోరినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు.

అందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో… విజయ్‌కుమార్‌.. కోగంటి సత్యాన్ని కలిశాడు. ఇదే అదనుగా భావించిన కోగంటి సత్యం.. కంపెనీని చౌకగా కొట్టేసేందుకు ప్లాన్‌ చేశాడు. తక్కువ ధరకు కంపెనీలో 90శాతం వాటాను తనకు ఇవ్వాలని రాహుల్‌ను కోరాడు కోగంటి సత్యం. ఇందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్‌ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.