వైసీపీలో శివనాథ్‌రెడ్డి చేరికకు అంతరాయం!

  • Published By: sreehari ,Published On : February 5, 2020 / 12:58 PM IST
వైసీపీలో శివనాథ్‌రెడ్డి చేరికకు అంతరాయం!

Updated On : February 5, 2020 / 12:58 PM IST

జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల సమయంలో విరోధులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలయిక హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నియోజక వర్గంలో రాజకీయం రోజుకో మలుపుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారంతో మరోసారి ఆసక్తిని రేపుతోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా కార్యకర్తలు, సన్నిహితులతో తాము 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబ విధేయులమని చెప్పుకొస్తున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా శాసనమండలి రద్దుకు ఓటు వేశానంటున్నారు. 

ఎప్పుడో చేరిపోయా  :
మరి వైసీపీలో చేరిపోయినట్టేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఓటు వేసిన రోజు నుంచి వైసీపీలో తాను చేరినట్లేనని, అధికారికంగా చేరాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్న వేస్తున్నారట శివనాథ్‌రెడ్డి. అయితే, ఈ విషయం తెలిసిన స్థానిక వైసీపీ నాయకులు షాకయ్యారట.

తమ వద్దకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నారట. వైసీపీ పెద్దలేమో ఈ విషయంలో నోరు మెదపవద్దని ఆంక్షలు పెట్టడంతో కొద్ది రోజులు ఆగండని సమాధానమిస్తూ దాటవేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు నిస్సహాయ స్థితిలో ఉన్నారట. జమ్మలమడుగులో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. 

శివనాథ్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నా.. హైకమాండ్‌ మాత్రం పెండింగ్‌లో పెడుతోందని అనుకుంటున్నారు. దీనికి కారణాలున్నాయట. 2014కు ముందు వైసీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి… ఒకసారి బయటకు వెళ్లి.. మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2015లో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.

ఇప్పుడేమో టీడీపీని కూడా విడిచిపెట్టి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆదినారాయణరెడ్డి చాలా సందర్భాల్లో వైఎస్‌ జగన్‌ను విమర్శించారు. ఆది సోదరుడు శివనాధ్‌రెడ్డి కూడా అప్పుడే టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అన్న ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినా శివనాథ్‌ మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. 

వైసీపీ నేతల్లో అయోమయం : 
ఇప్పుడు పాలనా వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలిలో శివనాథ్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి నుంచి తాను వైసీపీలోకి వచ్చేసినట్టే అని ఆయన చెప్పుకోవడంతో కొత్త సమస్య వచ్చిందంటున్నారు. అధికారికంగా చేరకుండానే అలా చెప్పుకోవడం పట్ల వైసీపీ నేతల్లో అయోమయం మొదలైంది. ఈ విషయంపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మీడియా ప్రశ్నిస్తే.. వైసీపీ పెద్దలు నోరు మెదపకూడదని ఆంక్షలు విధించారని చెప్పారు. 

వైఎస్ కుటుంబాన్ని తిట్టి, దుమ్మెత్తిపోసి.. ఇప్పుడు వైఎస్‌ విధేయులమని చెబితే ఎలా నమ్మాలని కార్యకర్తలు అంటున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం కార్యకర్తలకు, అభిమానులకు అధైర్య పడవద్దని, ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, కొద్ది రోజుల తర్వాత తానే అన్నీ చెబుతానని భరోసా ఇచ్చారట. శివనాథ్‌తో పాటు పెద్ద అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి వైసీపీలోకి రావడం ఖాయమేనని ప్రచారం చేస్తున్నారు. వారొస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రాబల్యం తగ్గుతుందని, వైసీపీలో చీలికలు ఖాయమని గుసగుసలు మొదలయ్యాయి.