Simhachalam: స్వామివారి ఆభరణాలు భద్రమేనా..? సింహాచలం దేవస్థానంలో ఉన్నతాధికారుల కమిటీ తనిఖీలు..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి చెందిన బంగారు, వెండి ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలు ప్రక్రియ కొనసాగుతోంది.

Simhachalam Temple
Simhachalam Appanna Jewelry Controversy: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆభరణాలను ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు తనిఖీలు చేస్తున్నారు. స్వామివారికి చెందిన బంగారు, వెండి ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలు ప్రక్రియ కొనసాగుతోంది. దేవాదాయ శాఖ, రాజమహేంద్రవరం ఆర్‌జేసీ ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ ఉద్యోగుల నుంచి పలు వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గత ఏడాది కడప ప్రాంతానికి చెందిన ప్రభాకరాచారి అప్పన్న భక్తులు సమర్పించిన రజిత, స్వర్ణ ఆభరణాల తూనికల్లో తేడాలున్నాయని, కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, వాటి నిజాలు నిగ్గు తేల్చాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషన్ సుబ్బారావు విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు దేవాదాయశాఖ జ్యూవలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి నెలలో రికార్డులను పరిశీలించారు. ఆలయం, పద్మనిధి, ట్రెజరీలో ఆభరణాలను తూనికలు వేసి రికార్డులను సిద్ధం చేశారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.
అయితే, ఆభరణ ప్రదర్శనశాలలోని వస్తువులు తనిఖీ చేయలేదు. ఈ నేథఫ్యంలో ప్రక్రియను పూర్తి చేయాలని విజయనగరం మాన్సాస్, అరసవల్లి దేవస్థానం ఈవో ప్రసాద్ చైర్మన్‌గా ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. అప్పటి నివేదిక ఆధారంగా కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించనున్నారు.
ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్.ప్రసాద్, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్‌జేసీ కార్యాలయం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. అన్ని వస్తువులు పరిశీలించాక తుది నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెప్పారు.