ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీలో బీజేపీలో కీలక మార్పులు చోటుకుంటున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సోము వీర్రాజు పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం (జూలై 27) ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీ అదిష్టానం కన్నాను తప్పించి సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు 2018లో అనూహ్యంగా అధ్యక్ష పదవి దక్కింది. వైసీపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిందనే వాదనలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో 2019 ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది.
అప్పటి నుంచే కన్నా లక్ష్మీనారాయణను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్‌తో దశాబ్దాలుగా ఉన్న అనుబంధం, బీజేపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని అందరూ భావించారు. మధ్యలో ఎమ్మెల్సీ మాధవ్‌కు పదవి దక్కనుందనే వార్తలు వచ్చినా, చివరకు పార్టీ సీనియర్ నాయకుడైన సోము వీర్రాజుకు అధ్యక్ష కుర్చీ దక్కింది. సోము వీర్రాజుకు పదవి దక్కడంపై ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.