ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మీ శాపనార్థాలకు భయపడనంటూ చంద్రబాబుపై స్పీకర్ ఫైర్

AP Assembly: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన సభలో మంగళవారం మరోసారి రచ్చ మొదలైంది. ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై జరుగుతున్న చర్చలో గొడవ మొదలైంది. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్ మీదకు తెదేపా నేతలు విమర్శలకు దిగుతుండటంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ శాపనార్థాలకు, ఉడుత ఊపులకు భయపడను. టీడీపీ సభ్యుల తీరు సరిగ్గా లేదు. మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ వార్నింగులు, వేళ్లు చూపించినంత మాత్రాన ఎవరూ భయపడరు. మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తాం.
‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు ఉంది టీడీపీ వైఖరి. 14సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. స్పీకర్ ను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా అభ్యంతరకరం. వయస్సు, అనుభవం ఉన్నవారు ఇలా చేయడం కరెక్ట్ కాదని’ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.
సోమవారం జరిగిన సమావేశాల్లోనూ ఇటువంటి రచ్చ జరిగి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసినా అక్కడి నుంచి కదలకపోవడంతో మార్షల్స్ సాయంతో సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులను బయటకు తరలించారు.