Nellore Zika Virus : నెల్లూరు జిల్లాలో భయం భయం.. కలకలం రేపిన జికా వైరస్..!

బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

Nellore Zika Virus : నెల్లూరు జిల్లాలో భయం భయం.. కలకలం రేపిన జికా వైరస్..!

Updated On : December 18, 2024 / 6:55 PM IST

Nellore Zika Virus : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ బాలుడికి జికా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పుణెలోని ల్యాబ్ కు పంపించారు డాక్టర్లు. చికిత్స కోసం బాలుడిని చెన్నైకి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చేరుకున్న వైద్య బృందాలు.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. జీజీహెచ్ డాక్టర్లతో పాటు మరికొన్ని బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆనం వెల్లడించారు.

‘అధికారులను పంపించాం. టెస్టులు చేయించాం. గ్రామం మొత్తం కలెక్ట చేయమన్నాం. ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అని టెస్టులు చేయించి రిపోర్టులు తెప్పిస్తాం. అసవరమైతే ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్న స్విమ్స్, రుయా, మంగళగిరిలో ఉన్న జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్లు, నిపుణుల బృందాన్ని పంపించి అటువంటి లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుది.

ఆ బాబుకి ఏం కావాలో అన్నీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంకా ఎవరికైనా ఉందా అనేదాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

”మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. తొలుత బాలుడికి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని ఆసుపత్రికి బాలుడిని తరలించడానికి ముందే బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి బ్లడ్ శాంపుల్స్ పంపించాం. బాలుడికి సోకింది జికా వైరసేనా? కాదా? అని నిర్ధారించడానికి ల్యాబ్ కి పంపారు” అని అధికారులు తెలిపారు.

జికా వైరస్ గురించి సమాచారం అందుకున్న వెంటనే.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. డాక్టర్ల బృందంతో కలిసి వెంకటాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జికా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుందని.. కాబట్టి దోమ కాటు నుంచి కాపాడుకోవాలని గ్రామస్తులకు జాగ్రత్తలు చెప్పారు. అటు గర్భిణులకు కీలక సూచన చేశారు అధికారులు. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు గ్రామానికి దూరంగా ఉండాలని చెప్పారు.

నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామస్తులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఆనం.

Also Read : కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్‌ అడ్డాలో ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?