కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్‌ అడ్డాలో ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?

ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు.

కడప కార్పొరేషన్‌పై టీడీపీ గురి పెట్టిందా? జగన్‌ అడ్డాలో ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?

CM Chandrababu Naidu

Updated On : December 17, 2024 / 9:28 PM IST

కడప గడ్డపై పొలిటికల్ మస్తీ కాస్తా.. కుస్తీగా మారబోతోందా..? అధినేత ఇలాకాలోనే ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తుందా..? కార్పొరేటర్ల జంపింగులు దేనికి సంకేతం. ఇది ఇంతటితో ఆగుతుందా లేదంటే మొత్తానికే ఎసరు పెడుతుందా.. మేయర్ కుర్చీ సైకిల్‌ సవారీ ఖాయమైనట్లేనా..? ఈ కుర్చీలాటలో నెగ్గేదెవరు తగ్గేదెవరు.

వైసీపీ అధినేత జగన్ అడ్డాలో కార్పొరేషన్‌ చేజారుతుందా.? మేయర్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా..? కార్పొరేటర్లు ఇచ్చే వరుస షాక్‌లు చూస్తుంటే.. లోకల్ పొలిటికల్ గాసిప్స్‌ను అంత ఈజీగా కొట్టిపారేయలేం. ఇప్పటికైనా, రేపటికైనా ఇదే నిజం కావచ్చనే చర్చ కడప ఇలాకాలో బిగ్ సౌండ్ చేస్తోంది..

కడప కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో 49వ డివిజన్ ఒక్కటే టీడీపీ గెలుచుకుంది. మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగ వేసింది. కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారిపోయాక.. ఎదురుగాలి మొదలైంది. ఎక్కడో ఏ మూలనో కాదు ఏకంగా జగన్‌ సొంత గడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాక్‌ ఇస్తున్నారు. ఏ కార్పొరేటర్‌ ఎప్పుడు గుడ్‌ బై అంటాడో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్‌సైడ్ టాక్.

జెండా పాతేయాలని టీడీపీ డిసైడ్!
ఎన్నికల ప్రచారంలో జగన్ వై నాట్ 175 నినాదం వినిపిస్తే.. చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారనేది అక్కడ వినిపించే కామెంట్.. అందుకు తగ్గట్టుగానే కడప మేయర్‌ కుర్చీపై జెండా పాతేయాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.. నెంబర్ గేమ్‌లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో 8మంది కార్పొరేటర్లు సైకిల్‌ ఎక్కేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆధ్వర్యంలో 8మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు..

కడప కార్పొరేషన్‌లో ఒకే ఒక్క స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు 9కి చేరింది.. ఐతే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్.. పది రోజుల్లో ఇంకో 10 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారంట.. ఎన్నికల కంటే ముందు నుంచి కడప మేయర్ సురేశ్‌ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పడు టీడీపీ నుంచి భరోసా వస్తుండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువా పక్కన పెట్టేస్తున్నారు. మొత్తానికి కార్పొరేషన్‌లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్‌లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.

వారి పాచికలు ఈజీగా వర్క్ అవుట్! 
కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం వెనుక మరో గాసిప్ కూడా వినిపిస్తుంది. కడపలో నవంబర్ 7న కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ వేయకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సంఘటనను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందట.

ఎమ్మెల్యేకు కుర్చీ వేయని వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు. సరిగ్గా ఇదే టైమ్‌లో వైసీపీలోని అగ్రనాయకులపై కార్పొరేటర్లకున్న అసమ్మతి టీడీపీకి కలిసొచ్చింది. ఇక వారి పాచికలు ఈజీగా వర్క్ అవుట్ అయ్యాయని తెలుస్తోంది. మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్‌సైడ్ టాక్. మరి వైసీపీ అధినేత జగన్.. ఈ జంపింగ్‌లకు అడ్డుకట్ట వేస్తారా.. లేదంటే కార్పొరేషన్‌ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్‌గా మారింది.

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?