CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లు, రోడ్ల విస్తరణ చేపట్టాలని సంకల్పించింది. కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్‌పాస్‌లు, 8 ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్లాన్లు కూడా సిద్ధం చేసి పెట్టారు.

Telangana CM Revanth Reddy
తెలంగాణ సర్కార్ ఏపీ సీఎం చంద్రబాబును టచ్ చేస్తుందా..? నందమూరి బాలకృష్ణ ఇంటికి జేసీబీని పంపడం ఖాయమేనా..? కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డికి సైతం రోడ్ ఎక్స్‌టెన్షన్ తిప్పలు తప్పవా? ప్రముఖుల ఆస్తుల జోలికి రేవంత్ సర్కార్ వెళ్తారా? కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణలో ప్రభుత్వ దూకుడు ఎలా ఉండబోతుంది..?
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే హైడ్రా పేరుతో హడలెత్తించింది. వచ్చి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరికొందరి ప్రముఖలకు చెందిన ఇళ్లపైకి, ఆస్తుల పైకి బుల్డోజర్లను పంపాలని చూస్తోంది. అయితే అవేమి ఆక్రమించుకున్నవో.. నిబంధనలకు విరుద్ధంగా కట్టినవో కాదు.
ఇళ్ల గోడలకు మార్కింగ్
రోడ్ల విస్తరణ కోసం రేవంత్ సర్కార్ కొందరు ప్రముఖుల ఇళ్ల గోడలకు మార్కింగ్ చేసి పెట్టింది. ఏకంగా నందమూరి బాలకృష్ణ ఇంటి గోడపై బిగ్ మార్కింగ్ పెట్టారు అధికారులు. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి చెందిన ఇంటి గోడకు సైతం తాటికాయంత అక్షరాలతో మార్కింగ్ చేసి పెట్టారు. బాలకృష్ణ ఇళ్లు కూల్చేస్తారా.. జానారెడ్డి ఇంటిమీదకు జేసీబీని పంపిస్తారా అంటూ ఆ మార్కింగ్ వైపు నిర్ఘాంతపోయి చూస్తున్నారు సిటీ జనం..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్.. ఎంత నరకంగా ఉంటుందో ఈ నగర జనానికి తెలియంది కాదు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ కష్టాల్ని తరిమేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లు, రోడ్ల విస్తరణ చేపట్టాలని సంకల్పించింది. కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్‌పాస్‌లు, 8 ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్లాన్లు కూడా సిద్ధం చేసి పెట్టారు. పర్యావరణ అనుమతులు కూడా తెచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పనుల ప్రక్రియను స్పీడప్ చేశారు. మరో 10 రోజుల్లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లను కూడా పిలుస్తారు. ఆవెంటనే పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి.
కేబీఆర్పార్క్ జాతీయ ఉద్యానవనం కావడంతో హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ SRDP పేరుతో 2016లో కేబీఆర్‌పార్కు చుట్టూ ప్లైఓవర్లు నిర్మించేందుకు ట్రై చేసింది. ఐతే ఫ్లైఓవర్ల పిల్లర్లు ఎకో సెన్సిటివ్జోన్లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఆ ప్రాజెక్టు అటుకెక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్‌ను టచ్ చేయకుండా డిజైన్లలో మార్పులు చేసింది. జూబ్లీ చెక్‌పోస్ట్ జంక్షన్ దగ్గర రెండు, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ల దగ్గర రెండు స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. వీటి నిర్మాణాల కోసం 87 మంది ప్రైవేటు ఆస్తుల్ని సేకరించాల్సి వస్తోంది.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది.. కేబీఆర్ పార్క్ చుట్టూ చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాల ఇళ్లు, ఆస్తులు ఉన్నాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ ముందే టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఇల్లు, మాజీమంత్రి జానారెడ్డి ఇల్లు ఆ లిస్ట్‌లో ఉన్నాయి.. వీరితో పాటు మరికొంతమంది ప్రముఖుల నివాసాలు, ఆస్తులున్నాయి. ఇప్పుడు వాటిని సేకరించడం రేవంత్ సర్కార్‌కు పెద్ద సవాల్‌గా మారింది.
చంద్రబాబుకు సెంటిమెంట్
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు సెంటిమెంట్ అని చెప్పాలి. ఇప్పుడు కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ జంక్షన్‌ను విస్తరిస్తే.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు కొంత భాగం కూల్చేయాల్సి వస్తుంది. మరి రేవంత్ సర్కార్.. టీడీపీ ఆఫీస్ జోలికి వెళ్తుందా.. లేదంటే ప్రత్నామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆ ట్రస్ట్ భవన్ వేదికగానే రాజకీయనేతగా ఎదిగారు. అలాంటి ట్రస్ట్ భవన్‌ను కూల్చే సాహసం చేస్తారా లేదా మినహాయింపు ఇస్తారా అన్నది చూడాలి.
ఇక కేబీఆర్ పార్క్‌కు ఎదురుగా, రోడ్ నెంబర్ 45 ఎంట్రెన్స్‌లో నందమూరి బాలకృష్ణ నివాసం ఉంటుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో నిర్మిస్తున్నారు. దీంతో బాలకృష్ణ ఇంటిని కొంతమేర కూల్చేయాల్సి వస్తోంది. బాలకృష్ణ సైతం ఈ ఇంటిని సెంటిమెంట్‌గా భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడా ఇంటిని కూల్చేస్తామంటే బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠను రేపుతోంది.
మరోవైపు రోడ్ నంబర్ 12 వైపు కూడా రోడ్డును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసాన్ని సైతం కొంతమేర కూల్చాల్సి వస్తోంది. అధికారులు జానా రెడ్డి ఇంటి గోడకు మార్కింగ్ కూడా చేశారు. దీంతో తన ఇంటి జోలికి వస్తే ఊరుకునేదే లేదని ఆయన అల్టిమేటం జారీ చేశారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్.. వాళ్ల పార్టీ నేతలను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.
ఇవే కాకుండా ఇంకా చాలా మంది ప్రముఖులు, బడా వ్యాపారులు నివాసాలు, ఆస్తులు ఆ కేబీఆర్ పార్కు చుట్టే ఉన్నాయి. అత్యంత ఖరీదైన ఈ ఏరియాలో కూల్చివేతలంటే మాములు విషయం కాదని అధికారులే అంటున్నారు. మరి వారందరిని రేవంత్ సర్కార్ ఒప్పిస్తుందా.. వారు ఒప్పుకోకుంటే ఏం చేయబోతుందన్నది వేచిచూడక తప్పదు.
అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి