TDP-Janasena JAC meeting
TDP-Janasena JAC Meeting : టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణియించారు. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలని జేఏసీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నవంబర్ 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు చేస్తామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్ 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందన్నారు. కరవు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు కరవు సాయం, ఇన్ పుట్ సబ్సిడీ అందేలా ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు.
పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామని చెప్పారు. వివిధ వర్గాలకు అండగా నిలిచేలా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
బీసీ సమస్యలు, బీసీలపై దాడులపై రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. టీడీపీ-జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారని పేర్కొన్నారు. దిశా యాప్ ఓ బోగస్ యాప్ అని విమర్శించారు.
దిశా చట్టం లేకుండా దిశా యాప్ బలవంత పెట్టి డౌన్ లోడ్లు చేయిస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆర్మీ ఉద్యోగిపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా రెండు పార్టీలు కలిసే వెళ్తాయని తెలిపారు. యువత, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.