TDP MLAs Protest : ఏపీ అసెంబ్లీ వద్ద ఉధ్రిక్తత.. బారికేడ్లను తోసుకొని అసెంబ్లీ లోపలికి వెళ్లిన టీడీపీ సభ్యులు
మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

TDP Leaders
AP Assembly Budget Session : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణం ఎదుట టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. తొలుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్సీ విషయంలో ఐదేళ్లుగా జగన్ తమని మోసం చేశారని అభ్యర్థులు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు వినతులు అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ వద్ద ప్లకార్డులు, నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బారికేడ్లు అడ్డుపెట్టి టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులు బారికేడ్లను తొలగించి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీలా ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే చిల్లర పార్టీలు తెలుగుదేశం – జనసేనలు కావన్నారు. తెలుగుదేశం – జనసేన పొత్తులు సహృద్భావ వాతావరణంలో జరిగాయి. 8వ తేదీన ఇద్దరు అధినేతలు మరోసారి సమావేశమై సీట్ల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మద్యనిషేధం హామీ అమలు చేయనందుకు చివరి అసెంబ్లీ సమావేశాల్లో అయినా జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.