GGH Hospital : అచ్చెన్నాయుడి డిశ్చార్జి డ్రామా

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 03:49 AM IST
GGH Hospital : అచ్చెన్నాయుడి డిశ్చార్జి డ్రామా

Updated On : June 25, 2020 / 3:49 AM IST

గుంటూరు గవర్నమెంట్‌ ఆస్పత్రి దగ్గర రాత్రి  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి డిశ్చార్జి డ్రామా నడిచింది. రాత్రి పొద్దుపోయాక అచ్చెన్నాయుడిని డిశ్చార్జి  చేస్తున్నట్టు GGH ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. డిశ్చార్జి ఆర్డర్స్‌ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. అందుకే డిశ్చార్జి చేస్తున్నామని వైద్యులు తెలిపారు. 

అచ్చెన్నను డిశ్చార్జి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి దగ్గరికి చేరుకున్నాయి. అర్థరాత్రి డిశ్చార్జి ఏంటని టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రి వైద్యులను ప్రశ్నించారు. ఉన్నపళంగా డిశ్చార్జి చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డిశ్చార్జి ఆర్డర్స్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. GGH వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే.. మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అచ్చెన్నను డిశ్చార్జి చేస్తే కస్టడీలోకి తీసుకోవడానికి అక్కడి వెళ్లారు. దీంతో టీడీపీ కార్యర్తలు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆస్పత్రిలోనే విచారించాలని కోరినా… మరో చోటుకు ఎందుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు కాసేపు వాగ్వాదం జరిగింది. కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

టీడీపీ శ్రేణుల ఆందోళనలతో GGH ఆస్పత్రి వర్గాలు అచ్చెన్నాయుడి డిశ్చార్జి ఆర్డర్స్‌ వెనక్కి తీసుకున్నాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు శాంతించారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడి నుంచి 2020, జూన్ 25వ తేదీ గురువారం ఉదయం అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌పై  ఏసీబీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. 

ఇక అంతకుముందు…  అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ స్పెషల్‌ కోర్టు అనుమతిచ్చింది. మూడురోజుల కస్టడీకి పర్మిషన్‌ ఇచ్చింది. అచ్చెన్నాయుడితోపాటు ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ మాజీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌ను కూడా విచారించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అచ్చెన్నను ఆస్పత్రి బెడ్‌పైనే విచారించాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాది కూడా ఉండాలని ఆదేశించింది. 

ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో అచ్చెన్నాయుడుని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు.  

Read: ఏపీలో అరెస్టుల కాలం : త్వరలో గంటా శ్రీనివాస్‌ అరెస్ట్‌