ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, తాను వైసీపీలో చేరకుండా కుమారులను చేర్చారు, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని ప్రకటించారు

టీడీపీ నేత, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ను కలిశారు. జగన్ సమక్షంలో తన కుమారులను ఆయన వైసీపీలో చేర్చారు. గణేష్ కుమారులు ఇద్దరికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానం పలికారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా సీఎం జగన్ కు తెలిపారు. తన కుమారులు వైసీపీలో చేరడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.
సీఎం జగన్ దమ్మున్న నాయకుడు అని వాసుపల్లి గణేష్ కితాబిచ్చారు. రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తుంది ఆయన ధైర్యమే అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయని వాసుపల్లి గణేష్ అన్నారు. ప్రభుత్వానికి ఎళ్లవేళలా మద్దతుగా ఉంటానని సీఎం జగన్ కు వాసుపల్లి గణేష్ తెలిపారు.
వాసుపల్లి గణేష్ వైసీపీకి జైకొట్టారు. జగన్ కు మద్దతు ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి తన కుమారులను తీసుకెళ్లిన వాసుపల్లి గణేష్, జగన్ సమక్షంలో వారిని వైసీపీలో చేర్చారు. గణేష్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు వైసీపీలో చేరకపోయినా, ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. అదే బాటలో వాసుపల్లి నడిచారు. ఆయన సైతం జగన్ పార్టీకి జైకొట్టారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు వైసీపీ గూటికి చేరుతూనే ఉన్నారు. మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోకుండా.. ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకి షాక్ ఇచ్చారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్… జగన్ కు జై కొట్టారు. వైసీపీ కండువా వేసుకోకుండా… అనుబంధ సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించారు. ఆయన మనసు మార్చేందుకు అయ్యన్నపాత్రుడు చివరివరకు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్ దూరంగా ఉంటున్నారు. వైసీపీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయన పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారని విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే… వాసుపల్లి గణేష్ కూడా వెళ్తారనే ప్రచారం నడిచింది. చివరికి అదే జరిగింది. సీఎం జగన్‌ను కలిసినా, వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతిస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు.