“నేను సిద్ధం” అంటూ పేర్ని నానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగ సవాల్..
"కావాలంటే అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి రికార్డులు తెప్పించుకుని చర్చకు రా.." అని అన్నారు.

వైసీపీ నేత పేర్ని నానికి టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగ సవాలు విసిరారు. మచిలీపట్నంలో యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
వల్లభనేని వంశీపై తాను తప్పుడు కేసులు పెట్టలేదని యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టానని గన్నవరం వచ్చి పేర్ని నాని తనపై చేసిన విమర్శలకు తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు.
పేర్ని నాని చర్చకు వస్తారా? వల్లభనేని వంశీయే కాదు గన్నవరంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తపై కూడా నేను తప్పుడు కేసులు పెట్టలేదు. కావాలంటే అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి రికార్డులు తెప్పించుకుని చర్చకు రా.. చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు సేవ చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా.
నకిలీ పట్టాలు పంచినప్పుడు, టీడీపీ ఆఫీస్ దాడి జరిగినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో మీకు తెలియదా..? వైసీపీలో ఉండగా నేను ఏ నాడు మీలా చంద్రబాబును గానీ, లోకేశ్‌ను గానీ, చంద్రబాబు సతీమణినిగానీ వ్యక్తిగతంగా దూషించలేదు, అవమానించలేదు. మీరు దూషిస్తుంటే ఇది తప్పు అని ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన వ్యక్తిని నేను” అని తెలిపారు.