పార్లమెంట్ లో టీడీపీకి దక్కని గది : గది నెంబర్ 5తో 30 ఏళ్ల అనుబంధం

తెలుగుదేశం పార్టీకి మరో పిడుగులాంటి వార్త. పార్లమెంట్ ఆవరణలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. పార్లమెంట్ సచివాలయంతో 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని ఫుల్ స్టాప్ పడింది. వివరాల్లోకి వెళితే.. పార్లమెంట్ ఆవరణలో ఆయా పార్టీలకు ఉన్న ఎంపీల బలం ఆధారంగా ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 14 పార్టీలకు ఈసారి అవకాశం లభించింది. అయితే టీడీపీ మొదటిసారి ఆ అర్హత కోల్పోయింది. పార్లమెంట్ ఆవరణలోని మొదటి ఫ్లోర్ లో 5వ నెంబర్ గది టీడీపీకి గతంలో కేటాయించారు. 1989 నుంచి ఈ గది టీడీపీకే ఉంది. అప్పట్లో కేంద్రమంత్రిగా, పార్లమెంటరీ నేతగా ఉన్న పి.ఉపేంద్ర హయాంలో 5వ నెంబర్ గది పార్టీకి కేటాయించటం జరిగింది.
సరిగ్గా 30 ఏళ్లకు.. ఇప్పుడు ఆ గదిని టీడీపీ కోల్పోయింది. దీనికి కారణం పార్లమెంట్ లో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలమే. లోక్ సభలో ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తంగా పార్లమెంట్ లోనే టీడీపీ బలం ఐదుగురు ఎంపీలే. దీంతో గదిని కేటాయించే అర్హత కోల్పోయింది.
30 ఏళ్లుగా టీడీపీకి ఆధ్వర్యంలో ఉన్న గది నెంబర్ 5.. ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ అధికారికంగా స్పందించలేదు. పార్లమెంట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.