గౌరవం లేనప్పుడు చావడమే మంచిది, మాకు వేరే దిక్కులేదు: రావిపాడు సుబేదార్ నాగేశ్వరరావు ఆవేదన
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.

Tadipatri
Ravipadu Village: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తమ తప్పు లేకపోయినా రెవెన్యూ అధికారులు అన్యాయంగా తమకు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ సుబేదార్ పలివెల నాగేశ్వరరావు, ఆయన భార్య విజయలక్ష్మి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సీఐ సుబ్రహ్మణ్యం డీఎస్పీ మూర్తి తక్షణమే స్పందించి వారిని అడ్డుకున్నారు. తాము ఇంటిలో ఉండగానే రెవెన్యూ అధికారులు ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నోటీసులు తొలగించాలని విజయలక్ష్మి, సుబేదార్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
రావిపాడు స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమకు చావు తప్ప వేరే దిక్కులేదని వాపోయారు. ”బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు. రెవెన్యూశాఖ అధికారులు పొరపాటు చేసి నన్ను నా కుటుంబాన్ని బలిచేస్తున్నారు. వారిచ్చిన సరిహద్దుల ప్రకారమే నేను ఇల్లు నిర్మాణం చేపట్టాను. ఇక్కడ 30, 40 డిగ్రీల వాతావరణంలో ఉండలేకపోతున్నారు. మేము అక్కడ బోర్డర్ లో మైనస్ 40 డిగ్రీలలో దేశం కోసం పోరాడుతున్నాం. గత 42 ఏళ్లుగా ఈ ప్రభుత్వ స్థలం ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటుంటే మామీద దాడికి పాల్పడ్డారు. నిన్న నా భార్యకు జరిగిన అవమానానికి నేను చచ్చిపోయినట్టేన”ని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తమకు ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు ప్రయత్నించగా నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మిఅడ్డుకోవడంతో ఆమెపై దాడి జరిగింది. దీంతో గాయాలతోనే ఆమె నిరసనకు దిగారు. దళితులు జరిపిన దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
తాడేపల్లిగూడెం DSP మూర్తి కామెంట్స్
పెంటపాడు మండలం రావిపాడులో జరిగిన ఉద్రిక్తతలపై 4 కేసులు నమోదు చేశాం. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు మేరకు సుభేధార్ మేజర్ నాగేశ్వరావు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అదే స్దలంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పేందుకు స్దానిక దళితులు పునుకొన్నారు. ఈ నేపథ్యంలో చేలరేగిన వివాదంపై కేసులు నమోదు చేశాం. పోలిసులపై రాళ్ళదాడి చేసిన ఘటనలో 60 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి రావిపాడు గ్రామంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు రావిపాడు గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Also Read: పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధించిన పోలీసులు