తమ్మినేనికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే పనిలో కూన రవికుమార్‌

వ్యక్తిగతంగా వైరం ముదురుతుండటంతో తమ్మినేని రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తమ్మినేనికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే పనిలో కూన రవికుమార్‌

Thammineni Seetharam: ఆ ఇద్దరు మామా అల్లుళ్లు… బావా బామ్మర్దులు కూడా.. ఐనా ఆ ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో ఉంటూ తమ రాజకీయాల కోసం నిత్యం కత్తులు దూసుకుంటుంటారు. దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత వైరంగా మారాయా? వైసీపీ అధికారంలో ఉండగా అల్లుడిని జైలుకి పంపిన మామపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా? ఇంటి పోరు ఎంతవరకు దారితీస్తుంది…?

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఆయన మేనల్లుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ పతాకస్థాయికి చేరుకుంటోంది. ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా 2009 నుంచి తలపడుతున్నా, గత ప్రభుత్వంలో రాజకీయ వైరం వ్యక్తిగత కక్ష సాధింపులకు దారితీసిందని ఆరోపణలు ఉన్నాయి. తన రాజకీయ ప్రత్యర్థిగా మారిన మేనల్లుడు రవిని ఇబ్బంది పెట్టేలా అప్పటి స్పీకర్‌ తమ్మినేని పావులు కదిపారని… ఆయనను జైలుకు పంపేందుకు కేసులు కూడా పెట్టారని చెబుతుంటారు. ఐతే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక…. కూన రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తుండటమే హాట్‌టాపిక్‌గా మారింది.

అప్పటివరకు తమ్మినేని వెంటే..
ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన తమ్మినేని 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దాంతో అప్పటివరకు తమ్మినేని వెంటే ఉన్న ఆయన మేనల్లుడు కం బామ్మర్ది కూన రవికుమార్‌…. తమ్మినేనికి ప్రత్యర్థిగా మారారు. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోగా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూన రవికుమార్‌ టీడీపీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ ఎన్నికల్లోనూ రవికుమార్‌ ప్రత్యర్థి తమ్మినేనే.. ఇక 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన రవికుమార్‌ నియోజకవర్గంలో పట్టుపెంచుకోగా, 2019 ఎన్నికల్లో వైసీపీ హవాతో తమ్మినేని గెలిచి స్పీకర్‌ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత ఎక్కువై వ్యక్తిగత కక్షసాధించుకునే వరకు వెళ్లింది. పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. ఇక ఇప్పుడు అధికారం చేతులు మారి తమ్మినేని ఓటమి చెంది ఇంటికే పరిమితమవడంతో తన వంతు ప్రతీకారం తీర్చుకునే పనిస్టార్ట్‌ చేశారట ఎమ్మెల్యే కూన రవికుమార్‌.

వైసీపీ అధికారంలో ఉండగా తమ్మినేని చేసిన పనులపై ఆరా తీస్తున్నారు. మామ ఎక్కడ దొరుకుతాడా? ఏ కేసులో ఇరికించేద్దామా? అని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కొంతమంది నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న ఎమ్మెల్యే రవికుమార్‌.. సమయం వచ్చినప్పుడు తమ్మినేని భరతం పట్టేలా ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. మున్ముందు చూపించబోయే సినిమాకు ట్రైలర్‌గా ఈ మధ్యే తమ్మినేని నకిలీ సర్టిఫికెట్‌తో లా పరీక్ష రాశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటర్మీడియట్‌ చదివిని తమ్మినేని.. డిగ్రీ చదవకుండా మూడేళ్ల లా డిగ్రీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు కూన రవికుమార్‌. ఈ వివాదం వైసీపీ హయాంలోనే మొదలైనా అప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో తమ్మినేని తప్పించుకోగలిగారంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఫిర్యాదుతో తమ్మినేని తప్పకుండా వివరణ ఇవ్వాల్సివస్తుందని అంటున్నారు.

సొంత బంధువులే అయినా..
సొంత బంధువులే అయినా.. రాజకీయంగా ఇద్దరి మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నియోజకవర్గంలో నెలకొంది. టీడీపీలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎదురులేని నేతగా ఎదగ్గా… అటు తమ్మినేని మాత్రం ఇటు ఇంటిపోరు.. అటు పార్టీలో అసమ్మతి నేతల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆమదాలవలస వైసీపీలో తమ్మినేనికి వ్యతిరేకంగా మూడు గ్రూపులు పనిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో తమ్మినేని ఓటమికి అసమ్మతి నేతలు కూడా ఓ కారణమనే వాదన ఉంది.

ఇక సొంత ఇంటిలో మేనల్లుడు, కం బామ్మర్దితో రాజకీయంగా.. వ్యక్తిగతంగా వైరం ముదురుతుండటంతో తమ్మినేని రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుమారు 69 ఏళ్ల వయసులో ఉన్న తమ్మినేని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కుమారుడిని పోటీకి పెట్టాలని భావించారు. కానీ, వైసీపీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. వచ్చే ఎన్నికల్లో వయసు రీత్యా మళ్లీ పోటీ చేయలేని పరిస్థితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్‌ చూపాల్సిన బాధ్యత తమ్మినేనిపై ఉంది. దీంతో కూన రవికుమార్‌ విసురుతున్న బాణాల నుంచి తప్పించుకుని నెగ్గుకు రావడమే తమ్మినేని కర్తవ్యం అంటున్నారు. మరి నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తన తప్పులేదని తమ్మినేని నిరూపించుకోగలరా? అన్నదే చూడాల్సివుంది.

Also Read: అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా?