అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా?

తమకి అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా?

Congress Party: ప్రజల మద్దతుతో గెలిచినా తమ మాట చెల్లడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారా? ప్రభుత్వం తమదే అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీలు గగ్గోలు పెడుతున్నారా? రాష్ట్ర కాంగ్రెస్లో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే… వారి ఆవేదనలో నిజమున్నట్లే కనిపిస్తోంది. తమ సూచనలు, సలహాలకు ఏమాత్రం విలువనివ్వని అధికారులు.. పదే పదే అమానిస్తుండటంతో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు నిరసనలకు దిగుతుండటమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇంతకీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆవేదనకు కారణమేంటి? లోపం ఎక్కడుంది?

తెలంగాణ కాంగ్రెస్లో కొత్త తలనొప్పి మొదలైంది. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే రచ్చ చేస్తుండటం పార్టీ పరువును బజారుకీడ్చుతోంది. సహజంగా ప్రొటోకాల్ విషయంలో విపక్షాలు విమర్శలు సంధిస్తుంటాయి. కానీ,ఇక్కడ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలే విపక్ష పాత్రను పోషించాల్సి వస్తోందంటున్నారు.

వరుసగా ఒకరి తర్వాత మరొకరుగా అధికారులు, పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు సంధిస్తుండటంతో ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెండురోజుల క్రితమే కొందరు పోలీసులపై స్పీకర్కు ఫిర్యాదు చేయగా, తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా అధికారుల తీరుపై నిరసన స్వరం వినిపించడం హాట్టాపిక్గా మారింది.

అప్పట్లో అవమానాలు భరించలేకే..
గత పదేళ్లు బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని.. తీరా ఇక్కడా పద్ధతులు మారడం లేదని మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. కావాలనే అధికారులు తమని తక్కువ చేసి చూస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో చాలామంది బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు గాంధీభవన్లో టాక్ వినిపిస్తుంది. తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని మంత్రులు సైతం తమ సన్నిహితుల వద్ద గొణుగుతున్నల్లు చెబుతున్నారు. ఇక కార్పొరేషన్ చైర్మన్లు అయితే, పవర్ లేని పదవి తీసుకొని తప్పు చేశామని గొల్లు మంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటుతున్నా ప్రభుత్వంపై పట్టు సాధించలేదని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రులంతా దాదాపు కొత్తవారు కావడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోందంటున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ సైతం గుర్తించినా ఎలా హ్యాండిల్ చేస్తే ఏమవుతుందో అని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పటికీ అధికార యంత్రాంగం అంతా పాతదే కావటం వల్ల కొత్త ప్రభుత్వాన్ని లైట్గా తీసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రొటోకాల్ పాటించడం లేదని వాపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దుమారం రేపగా, తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఓ పోలీసు అధికారి వేధింపులకు గురిచేస్తున్నారనే సమాచారం కాంగ్రెస్ నేతలను షాక్కు గురిచేస్తోంది. మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ సీఐగా తనకు నచ్చిన వారిని ముఖ్యమంత్రి అనుమతితో ఎమ్మెల్యే నియమించుకున్నారట.. ఈ నియామకాన్ని జీర్ణించుకోలేని అక్కడి పోలీస్ కమిషనర్ ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

చిన్నచూపు చూస్తున్నారని..
కమిషనర్ తనను వేధిస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యేనే వాపోతుండటంతో అధికారుల తీరు చర్చకు తావిస్తోంది. పోలీస్ కమిషరే కాకుండా మానకొండూరులో ఏ అధికారి కూడా ఎమ్మెల్యేను లెక్క చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విషయంలోనూ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేల మాదిరిగా అవమానాలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏ సమాచారం అడిగినా అధికారులు సరిగా స్పందించడం లేదని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో కొందరు అధికారులు వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకే ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే తమ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని కార్పొరేషన్ చైర్మన్లు వాపోతున్నారు.

ఛార్జ్ తీసుకోగానే తమ తమ కార్పొరేషన్ పరిధిలో గతంలో జరిగిన వాటిపై విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని భావించినా.. తమకి అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అంతా తమను పట్టించుకోవడం లేదని వరుసగా గొంతు విప్పుతుండటంతో ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదటజ కొందరు ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డికి అధికారుల తీరును పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. మొత్తానికి ఈ రగడపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఒకరి తర్వాత ఒకరు.. ఇప్పుడు విడదల రజినీ చుట్టూ ఉచ్చు!