మంత్రి పేర్నినానిపై కావాలనే హత్యాయత్నం…పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు

attempted murder on minister Perninani : ఏపీ మంత్రి పేర్నినానిపై కావాలనే నిందితుడు హత్యాయత్నం చేసినట్లు తమ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో ఎలాంటి భయం లేకుండా నాగేశ్వరరావు సమాధానం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇప్పటికే ఐదు ప్రత్యేక బృందాలతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు.. నాగేశ్వరరావు సోదరిని పూర్తి స్థాయిలో మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న నాగేశ్వరరావుకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్న పోలీసులు..ఈ రోజు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
మంత్రి పేర్నినానిపై దాడికి ప్రయత్నించిన తాపీ మేస్త్రీ నాగేశ్వరరావుపై ఇప్పటికే పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో నాలుగు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అటు మంత్రి పేర్నినాని ఇంటి దగ్గర భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి… భద్రతాసిబ్బంది ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆదివారం నాగేశ్వరరావు.. మంత్రి కాళ్లకు దండం పెడతానని వచ్చి తాపీతో దాడికి ప్రయత్నించాడు. మంత్రి అనుచరులు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.