50 శాతం ఆక్యుపెన్సీతో Theatre ఖర్చులు ఎలా.. సినిమాలే లేకుండా ఏం చేయాలి

50 శాతం ఆక్యుపెన్సీతో Theatre ఖర్చులు ఎలా.. సినిమాలే లేకుండా ఏం చేయాలి

Updated On : October 2, 2020 / 12:37 PM IST

సెంట్రల్ గవర్నమెంట్ అన్‌లాక్ 5 గైడ్‌లైన్స్‌ రిలీజ్ చేసింది. ఇందులో అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్లు కూడా ఇచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి షో తర్వాత థియేటర్‌ను శానిటైజ్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపడం, వాటి నిర్వహణ భారం అధికమవుతుందంటున్నారు సినీ ప్రముఖులు.

చిన్న బడ్జెట్ చిత్రాలకు మాత్రమే ఈ అవకాశం ఉపయోగపడుతుందని, స్టార్స్ సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయలేమని అంటున్నారు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు. చిన్న సినిమాలు విడుదల చేస్తే OTTలకు అలవాట్టుపడ్డ వారంతా థియేటర్‌కు వస్తారా? అనేది కూడా అనుమానమే.



లాక్‌డౌన్‌ వల్ల చాలా సినిమాలు చిత్రీకరణ ఆగిపోయాయి. కానీ లాక్‌డౌన్‌లోనే రామ్‌గోపాల్‌ వర్మ పలు సినిమాలను చిత్రీకరించారు. అందులో ‘కరోనా వైరస్‌’ ఒకటి. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్‌ తెరుచుకున్న తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే అని ట్వీట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ.

థియేటర్‌ యాజమాన్యాలు కరెంట్‌ బిల్లులు కట్టని కారణంగా అందరి పవర్‌ ఫ్యూజ్‌లు సంబంధిత అధికారులు తీసుకుని వెళ్లారని మేనేజర్లు బాధపడుతున్నారు. థియేటర్లు నడవాలంటే కంటెంట్‌ కావాలి. సినిమా పరిశ్రమలో ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా ఎవ్వరి దగ్గరా కంటెంట్‌ లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కంటెంట్‌ ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్‌ సినిమాని డబ్బులు ఇచ్చి కొనరు. కేంద్రప్రభుత్వం ప్రకటన ఇచ్చినా… రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడమే అందరూ ఆలోచిస్తున్న విషయం.



గతంలో ఉన్న ఖర్చులకంటే ఇప్పుడు థియేటర్లకు శానిటైజేషన్‌ రూపంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా అరికట్టాలి? అసలు జనాలు వస్తారా, రారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ థియేటర్లు ఆరంభించాకే సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుందో చూడాలంటున్నారు నిర్వాహకులు.