Srikalahasti: శ్రీకాళహస్తి టీడీపీలో సమసిన వివాదాలు.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీవీ నాయుడికి ఎమ్మెల్సీ పదవీ లేదా టీటీడీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.

SCV Naidu, Bojjala Sudhir Reddy (photo: facebook)
Srikalahasti – TDP: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి టీడీపీలో వివాదాలు సమసిపోయాయి. టీడీపీ ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudhir Reddy) ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడి ఇంటికి వెళ్లి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిద్దరు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఎస్సీవీ నాయుడు తిరిగి పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తమ మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఆయనకు వ్యతిరేకంగా తాను ఓ వాయిస్ మెసేజ్ పెట్టానని తెలిపారు. ఎస్సీవీ నాయుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని చెప్పారు.
తిరుపతి జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరగణం ఉన్నారని తెలిపారు. తనను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఆయన కృషి చేస్తారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీవి నాయుడుకు ఎమ్మెల్సీ పదవీ లేదా టీటీడీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని తెలిపారు.
తిరిగి టీడీపీలోకి రావడం సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఎస్సీవీ నాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో టీడీపీ గెలుస్తుందని అన్నారు. ఇక్కడ టీడీపీలో ఎటువంటి గ్రూపులూ ఉండవని చెప్పారు.