ఈసారి స్థానిక సంస్థల్లో చక్రం తిప్పేది మహిళలే!

  • Published By: sreehari ,Published On : March 10, 2020 / 01:09 PM IST
ఈసారి స్థానిక సంస్థల్లో చక్రం తిప్పేది మహిళలే!

Updated On : March 10, 2020 / 1:09 PM IST

రాష్ర్టంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల పాత్ర మరింత పెరగనుంది. వారికి కేటాయించిన సీట్లు కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మహిళా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. 103 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ స్థానాల్లో 51 స్థానాలు మహిళలకు దక్కాయి. దీన్ని బట్టి చూస్తే మహిళల ప్రాధాన్యం స్థానిక సంస్థల్లో పెరిగిందనే చెప్పాలి. ఏపీలోని 103 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

నిర్ధేశించిన ప్రకారం మొత్తం స్థానాల్లో 51 స్థానాలు మహిళలకు దక్కాయి. ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ మహిళలకు 7, బీసీలకు 17, జనరల్ కోటాలో 26 సీట్లు మహిళలకు కేటాయించారు. ఈసారి స్థానిక సంస్థల్లో మహిళలకు చేసిన రిజర్వేషన్ వల్ల ఎక్కువ మంది ఛైర్ పర్సన్లుగా అవకాశం దక్కనుంది. మరోవైపు టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో పోటీ నెలకొంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. సమర్థులను ఎంపిక చేసే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. 

రాష్ర్ట వ్యాప్తంగా ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం వార్డు స్థానాలు 2,123 ఉన్నాయి. వాటిల్లో ఎస్టీ జనరల్‌ 76 ఉంటే మహిళలకు 8 ఉన్నాయి. ఎస్సీజనరల్‌ 158 ఉంటే ,మహిళలకు 128 కేటాయించారు. బీసీ జనరల్ 341 స్థానాలు కాగా, మహిళలకు 302 స్థానాలు కేటాయించారు. ఇవి కాకుండా మహిళలకు జనరల్‌  కేటగిరిలో మరో 608 స్థానాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే వార్డుల రిజర్వేషన్ లోనూ మహిళలకు సముచితమైన స్థానం లభించినట్లైంది.

గతంతో పోలిస్తే రాజకీయంగా మహిళలకు అందివచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జనాభాలోనూ, ఓటర్లలోనూ పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించినట్లైంది. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు రాజ్యాంగం కల్పించిన విధంగా సముచిత స్థానం ఇవ్వాల్సిన అవశ్యత ఏర్పడింది.