Anusha Dead Body : పెన్నానదిలో అనూష శవం.. కడప జిల్లాలో విషాదాంతమైన యువతి మిస్సింగ్ కేసు

కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది.

Anusha Dead Body : పెన్నానదిలో అనూష శవం.. కడప జిల్లాలో విషాదాంతమైన యువతి మిస్సింగ్ కేసు

Updated On : October 24, 2022 / 5:48 PM IST

Anusha Dead Body : కడప జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన ఒక విద్యార్థిని పెన్నా నదిలో శవమై తేలింది. బీ కోడూరు మండలానికి చెందిన అనూష బద్వేల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 20న కాలేజీకి వెళ్లిన అనూష అదృశ్యమైంది. తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అదే రోజున బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే, అనుకోని విధంగా నిన్న సిద్ధమఠం సమీపంలోని జంగాలపల్లె ఇసుక రీచ్ దగ్గర అనూష మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. అనూషకు ఏమైంది? ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అనూషకు ఏమొచ్చింది? ప్రాణాలు తీసుకునేంత బాధ ఏమొచ్చింది? లేక అనూషను ఎవరైనా చంపేసి పెన్న నదిలో పడేశారా? ఇప్పుడీ ప్రశ్నలు పోలీసులకు సవాల్ గా మారాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు తల్లిదండ్రులు. పథకం ప్రకారమే తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. బద్వేల్ మండలం పాపిరెడ్డిపల్లెకి చెందిన గురు మహేశ్ రెడ్డి అతడితో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనూష తల్లిదండ్రులు.

తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని, తమ కుమార్తె చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటోంది అనూష తల్లి లక్ష్మీదేవి. నిందితులను ఎన్ కౌంటర్ చేస్తేనే తమకు న్యాయం చేసినట్లు అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అనూష మిస్సింగ్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే, తమ బిడ్డ బతికుండేదన్నారు అనూష తండ్రి రామిరెడ్డి. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యమే తమ బిడ్డను బలితీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, అనూష మిస్సింగ్ కేసుపై 20వ తేదీనే కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. అనూష మృతిపై అనుమానాలు ఉన్నాయని, అనూషతో ఫోన్ లో చాట్ చేసిన వ్యక్తిపై విచారణ జరుపుతున్నామన్నారు బద్వేల్ రూరల్ సీఐ హనుమంత్ నాయక్.