తిరుమలలో త్వరలోనే సర్వ దర్సనం టోకెన్లు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగస్టు నెలాఖరున జరిగే బోర్డు సమావేశంలో చర్చించి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబంధనల సడలింపుల ఆధారంగా వృధ్దులు, చిన్నారులకి దర్శనం కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
తిరుమల లో కరోనా కేసులు పెరగడానికి భక్తుల దర్శనానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. ‘టీటీడీ ఆదాయం కోసమే శ్రీవారి దర్శనాలు చేయిస్తోందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాటు చేశామన్నారు.
తిరుపతిలో పాక్షిక లాక్‌డౌన్ కారణంగా, తిరుపతిలో రోజుకు కేటాయిస్తున్న 3 వేల ఉచిత దర్శన టోకెన్లను కొంతకాలంగా నిలిపివేసినట్టు చెప్పారు. కరోనా బారినపడిన చాలామంది ఉద్యోగులు కోలుకుని విధులకు హాజరవుతున్నారని, మరికొంత మంది చికిత్సలో ఉన్నారని చెప్పారు. టిటిడి ఉద్యోగుల్లో మొత్తం 743 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 402 మంది కోలుకున్నారు, 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జెఇఓ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోందని ఆయన తెలిపారు.
ఎస్వీబీసీ త్వరలో యాడ్ ఫ్రీ చానెల్ గా మారుస్తాం
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను త్వరలోనే యాడ్ ఫ్రీ చానెల్‌గా మారుస్తామని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. ఛానల్ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోందని…. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయని వివరించారు.
ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టిటిడిపై అదనపు భారం పడకుండా ఎస్వీబీసీ హెచ్‌డి ఛానల్ ప్రారంభించాలని నిర్ణయించాం. త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తామని ఆయన చెప్పారు. ఎస్వీబీసీలో
శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయాం. ఆ తరువాత న్యూస్ బులెటిన్లో ప్రముఖంగా ప్రసారం చేశాం. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవు. కొంతమంది దీనిపై అనవసరంగా విమర్శలు చేసే పని ప్రారంభించారని ఆయన వివరించారు.