అప్పుల బాధతో టీవీ నటి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : July 23, 2020 / 12:04 PM IST
అప్పుల బాధతో టీవీ నటి ఆత్మహత్య

Updated On : July 23, 2020 / 12:54 PM IST

టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్‌ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోసం గతంలో హైదరాబాద్‌ వచ్చారు. రెండు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయారు.

అహ్మద్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. వారికి కూతురు ఉంది. అనంతరం రేఖ కాజకు చెందిన చైతన్యను రెండో పెళ్లి చేసుకున్నారు. వేడుకలు, కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేస్తూ, ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ జీవనం సాగించారు.

అహ్మద్, రేఖ విద్యానగర్‌లోని నాలుగో లేన్ లో ఉంటున్నారు. కాగా, గత రెండేళ్లుగా పాటలు పాడటం మానేశారు. భర్త చైతన్య రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ నష్టాల పాలవడంతో అప్పులు పెరిగాయి. దీంతో రేఖ బాగా కుంగిపోయారు. బుధవారం(జూలై 22,2020) బాత్రూమ్ కి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త చైతన్యం. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా రేఖ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో భర్త చైతన్య షాక్ కి గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేఖ మరణం స్తానికంగా విషాదం నింపింది.