Nellore AO Death Case : బావ హత్య కేసులో ట్విస్ట్.. అరెస్ట్ భయంతోనే భార్యా పిల్లలతో కలిసి హరికృష్ణ ఆత్మహత్య?
Nellore AO Death Case : ఆస్తి కోసం బావను హత్య చేసిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసులో నిందుతులుగా ఉన్న హరికృష్ణ కుటుంబం గూడ్స్ రైలు కింద ఆత్మహత్య చేసుకుంది. దీని వెనుక అసలు కారణాలేంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Harikrishna Death Case
- హత్య నుంచి ఆత్మహత్య వరకు.. హరికృష్ణ కథకు సింగరాయకొండలో ముగింపు!
- హత్య కేసు భయమా?.. కుటుంబంతో రైలు కింద పడి బలవన్మరణం!
- కోటి రూపాయల ఆశ.. ఒక హత్య.. చివరికి నలుగురి ప్రాణాలు!
- పోలీసుల ఉచ్చు బిగియగానే కుటుంబంతో రైలు కిందపడి ఆత్మహత్య
Nellore AO Death Case : నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరికృష్ణ కుటుంబం సమేతంగా సింగరాయకొండలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కోటి ఆస్తి కోసం బావ శ్రీహరిని కుక్కలను చంపే ఇంజెక్షన్ హత్య చేసిన హరికృష్ణ పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోటి ఆస్తి కోసమే బావ హత్య :
ఈ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలకు తావిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడూరుకు చెందిన హరికృష్ణ తన బావ శ్రీహరి (Harikrishna Death Case) నమ్మించి కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తి, నగదును తన పేరిట రాయించుకున్నాడు. అనంతరం ఆ ఆస్తిని తిరిగి ఇవ్వాలని శ్రీహరి అడగడంతో అతడి అడ్డు తొలగించాలని భావించాడు. పథకం ప్రకారమే కుట్ర పన్ని హత్య చేయించినట్టు నిందితుడు హరికృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.
పెంచలకోన ఆలయ దర్శనం పేరుతో శ్రీహరిని కారులో తీసుకెళ్లిన హరికృష్ణ.. సహచరులైన రవీంద్ర, యానాది సాయంతో కుక్కలను చంపేందుకు వాడే విషపు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, ఈ హత్యను గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నించినట్టుగా కూడా ఆరోపిస్తున్నారు.
Read Also : AO Murder: కోటి ఆస్తి కోసం దారుణం.. కుక్కల ఇంజెక్షన్‌తో బావను హత్య చేసిన బావమరిది.. నెల్లూరు జిల్లాలో ఘోరం
శ్రీహరి భార్య ఫిర్యాదులో విషయం వెలుగులోకి :
అయితే, శ్రీహరి భార్య లావణ్య ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రవీంద్ర, యానాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ పరిణామాల మధ్య సింగరాయకొండ రైల్వే స్టేషన్లో హరికృష్ణ, అతని భార్య ఇద్దరు చిన్నారులతో కలిసి గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
కుటుంబంతో ఆత్మహత్యకు కారణాలేంటి?
స్థానికుల సమాచారం ప్రకారం.. గూడ్స్ రైలు వచ్చే వరకు హరికృష్ణ కుటుంబం రెండో ప్లాట్‌ఫారంపై ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. రైలు దగ్గరకు రాగానే భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఒక్కసారిగా పట్టాలపైకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే, ఈ ఘటనకు కచ్చితమైన కారణాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శ్రీహరి హత్య కేసులో పెరుగుతున్న ఒత్తిడి, అరెస్ట్ భయం, చట్టపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంతో పాటు ఇతర అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
