శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన

  • Published By: madhu ,Published On : January 21, 2020 / 01:15 PM IST
శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన

Updated On : January 21, 2020 / 1:15 PM IST

ఉత్కంఠకు తెరపడింది. శాసనమండలి ముందుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమిదిన్నర గంటల అనంతరం సాయంత్రం రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలి ఛైర్మన్ షరీఫ్ అనుమతితో మంత్రులు బోత్స, బుగ్గనలు అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను ప్రవేశపెట్టారు.

 

ప్రభుత్వ బిల్లులను ప్రవేశ పెట్టకుండా ఎక్కువ సేపు ఆపలేమని మండలి ఛైర్మన్ షరీఫ్ చెప్పారు. బిల్లులు ప్రవేశపెట్టాక..71 రూల్‌‌పై చర్చ జరుపుదామని వెల్లడించడం విశేషం. ఇక్కడ..బిల్లులను ప్రవేశపెట్టడాన్ని టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. పోడియం వద్దకు చేరుకున్న టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డఏ రద్దు బిల్లులు 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అనంతరం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసన మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ టీడీపీ అనూహ్యంగా టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.

 

ఈ రూల్‌ను మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. దీనిని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కానీ మండలి ఛైర్మన్ రూల్‌కు అనుమతినిస్తూ..చర్చకు ఒకే చెప్పారు. దీనిపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభ పలుమార్లు వాయిదా పడ్డాయి. అనంతరం ఛైర్మన్‌తో ఏకాంతంగా మంత్రులు భేటీ అయ్యారు. వాయిదా పడిన అనంతరం సాయంత్రం 6.00 గంటల తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. మరి చర్చ జరిగిన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

* వైసీపీ సభ్యుల బలం 9
* గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ బలం 10.
* టీడీపీ మండలిలో బలం  32 మంది.

* టీచర్ ఎమ్మెల్సీలు ఐదుగురు, ఇండిపెండెంట్ సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారా ? తటస్థంగా ఉంటారా.

* శాసనమండలిలో 58 మంది సభ్యులున్నారు. 
* టీడీపీ -28, వైసీపీ -9, బీజేపీ 2, పీడీఎఫ్ 5, నామినేటెడ్ సభ్యులు – 8. 
* స్వతంత్రులు 3, ఖాళీలు -3. 

 

Read More : ఫస్ట్ టైం ఐస్ క్రీం తిన్న చిన్నారి రియాక్షన్ చూశారా