Uppada Sea Erosion Wall: ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ. 323 కోట్లతో తీర రక్షణ గోడ.. పవన్ సమక్షంలో కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ తీర ప్రాంతం(Uppada Sea Erosion Wall) సుదీర్ఘకాలంగా తీవ్రమైన సముద్రపు కోతకు గురవుతోంది.
Uppada sea erosion wall construction andhra pradesh govt iit madras
- ఉప్పాడ తీర రక్షణకు ఒప్పందం.
- రూ. 323 కోట్లతో గోడ.
- ఐఐటీ మద్రాస్ సాంకేతిక పర్యవేక్షణ.
Uppada Sea Erosion Wall: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ తీర ప్రాంతం సుదీర్ఘకాలంగా తీవ్రమైన సముద్రపు కోతకు గురవుతోంది. అలల ఉధృతికి నివాస ప్రాంతాలు, రోడ్లు, మత్స్యకార గ్రామాలు ముంపునకు గురవుతూ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ సమస్యకు అత్యాధునిక శాస్త్రీయ పద్ధతిలో శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తీర పరిరక్షణ గోడ(Uppada Sea Erosion Wall) డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) రూపకల్పన, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ సంస్థకు అప్పగించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరిలో ఈ ఒప్పందం కుదిరింది.
రూ. 323 కోట్లతో రక్షణ గోడ:
ఈ ప్రాజెక్టును దాదాపు రూ. 323 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఐఐటీ మద్రాస్‌లోని ఓషన్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఉప్పాడ తీరంలోని అలల తీవ్రత, సముద్ర ప్రవాహాలు, కోత స్వభావంపై లోతైన శాస్త్రీయ పరిశోధనలు చేయనుంది. సముద్రపు భయంకర అలల దాడిని తట్టుకునేలా అత్యంత మన్నికైన ఇంజినీరింగ్ డిజైన్‌ను రూపొందించడమే కాకుండా, నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించనుంది.
నవంబర్ నుంచి ప్రారంభం కానున్న పనులు:
ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం పూర్తికావడంతో రాబోయే నవంబర్ నాటికే క్షేత్రస్థాయి నిర్మాణ పనులను మొదలుపెట్టేందుకు జిల్లా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉప్పాడ పరిసర మత్స్యకార గ్రామాలను వేధిస్తున్న ఆస్తి, ప్రాణ నష్ట భయాలకు ఈ ప్రాజెక్టు ముగింపు పలకనుంది. శాస్త్రీయ నిర్మాణం ద్వారా తమ ఊళ్లకు, జీవనోపాధికి శాశ్వత ధీమా లభించనుండటంతో స్థానిక ప్రజలు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
