ఆ రోజున స్వామి వారిని దర్శిస్తే..మోక్ష దాయకం

వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదంటారు. ఆ రోజున స్వామి వారిని దర్శిస్తే ఏకంగా మోక్ష దాయకమే అని వేదాలు చెబుతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులు పరమపవిత్రంగా భావించే ఆ వైకుంఠ ఏకాదశి 2020, జనవరి 6న రానుంది. అందుకే తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
ధనుర్మాసం మొదలైన తరువాత వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఇది మార్గశిరం లేదా పుష్యం మాసంలో గాని వస్తుంది. వైష్ణవులకు చాలా ముఖ్యమైనది. హిందువుల్లో అందరూ ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠనాథుడి ఆగమనం అనే మూడు కారణాలు ఈ ఏకాదశిని విశిష్టస్థానంలో నిలుపుతున్నాయి. స్వర్గ ద్వారం విషయానికొస్తే, దక్షిణాయణంలో కన్నుమూసిన పుణ్యాత్ములందరికీ ఈ ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరవబడతాయట.
వీరందరూ ఈరోజునే స్వర్గప్రవేశం చేస్తారని నమ్మకం. ఇక ముక్కోటి ఏకాదశి అంటే మూడుకోట్ల ఏకాదశులతో సమానమైన శక్తి కలది కాబట్టి ఆ పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలు వెంటరాగా, భూమిమీద అడుగుపెట్టి, ముర అనే అసురుడిని సంహరించాడు కాబట్టే ఇది ముక్కోటి ఏకాదశిగా మారిందని ప్రతీతి. వైకుంఠ ద్వారాలు తెరచుకుని స్వయంగా ఆ వైకుంఠనాథుడే తరలివచ్చిన ఏకాదశి కావడంతో, వైకుంఠఏకాదశి అన్న పేరు వచ్చిందని చెబుతారు.
Read More : వైకుంఠ ఏకాదశి : తిరుమల ముస్తాబు..ఏర్పాట్ల వివరాలు