Vallabhaneni Balashowry
YCP MP Vallabhaneni Balashauri : ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లోకి క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారిగా ఇంఛార్జిలను మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను మార్పులు చేర్పులు చేశారు. ఈక్రమంలో టికెట్ దక్కని, దక్కదని భావిస్తున్న కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు వైసీపీ నేతలు ఆ పార్టీలో ఇమడలేక ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Also Read : Yarlagadda Lakshmi Prasad : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి పవన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే బాలశౌరి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు రెండు గంటలపాటు సాగింది. ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో ఎప్పుడు చేరేది అనే విషయంపై క్లారిటీ రాలేదు. పవన్ భేటీ ముగిసిన తరువాత బాలశౌరి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే, మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు బాలశౌరి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బాలశౌరి జనసేన పార్టీలో చేరితే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా గుంటూరు నుంచి పోటీచేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలశౌరి మాత్రం మరోసారి మచిలీపట్నం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే, టీడీపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో ఏ పార్టీకి ఏ స్థానం లభిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు.. దీంతో గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీకి దక్కిన స్థానం నుంచి బాలశౌరిని పవన్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. పవన్, బాలశౌరి భేటీలో ఈ అంశంపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, బాలశౌరికి పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?
గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై బాలశౌరి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. స్థానికంగా వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ లతో చాలాకాలంగా బాలశౌరికి విబేధాలు కొనసాగుతూ వస్తున్నాయి.. ఈ విబేధాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే తనకు వైసీపీ అధిష్టానం సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. వైసీపీలో ఇలానే కొనసాగితే భవిష్యత్ లో రాజకీయంగా మనుగడ సాగించలేమని భావించిన బాలశౌరి ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ తరువాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు..