జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?
మామూలుగా అయితే బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ పెద్దగా బలమైన కారణాలను ఆపాదించరు. బాలకృష్ణ పెద్దగా వెనకాముందూ ఆలోచించకుండా 'ఇన్‌స్టాంట్‌గా' ప్రతిస్పందించే వ్యవహార శైలి ఉండటమే ఇందుకు కారణం.

Flexi War In NTR Family
Jr NTR Flexi Issue : దివంగత మహానేత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన సందర్భంగా జరిగిన సంఘటన.. పాత చర్చకు కొత్త రచ్చ తోడయినట్లయింది. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణకు, ఆయన అనుచరులు అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూపించారు.
వీటిని చూసిన వెంటనే ఒకింత అసహనానికి గురైన బాలకృష్ణ.. తన సహజ రీతిలో ‘తీయించేయ్’ అని హుకుం జారీ చేశారు. మామూలుగా అయితే బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ పెద్దగా బలమైన కారణాలను ఆపాదించరు. బాలకృష్ణ పెద్దగా వెనకాముందూ ఆలోచించకుండా ‘ఇన్‌స్టాంట్‌గా’ ప్రతిస్పందించే వ్యవహార శైలి ఉండటమే ఇందుకు కారణం.
15 సంవత్సరాల క్రితం మొదలైన అంతరం..
ఎన్టీఆర్ కుటుంబానికి ముఖ్యంగా బాలకృష్ణకు, చంద్రబాబుకు కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబంలో భాగమైన జూనియర్ ఎన్టీఆర్‌కూ దాదాపు 15 సంవత్సరాల క్రితం మొదలైన అంతరం.. రానురాను అగాధంగా మారడంతో.. ఈ ఇద్దరు బంధువుల కుటుంబాల మధ్య ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా.. దాన్ని భూతద్దంలో చూడటం మొదలయ్యింది. ఈ అగాధానికి రాజకీయ రంగు కూడా పులుముకుంటూ ఉండటంతో.. తరచూ ఇదొక వివాదంగా చూడటం మామూలయ్యింది.
Also Read : అధికారం దక్కాలంటే అక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే.. ఇంతకీ ఆ జిల్లా ఏది?
జూ.ఎన్టీఆర్ ను చేరదీసిన చంద్రబాబు..
అసలు ఈ వివాదం, అగాధం ఎందుకు ఏర్పడిందో చెప్పాలంటే.. కాస్త గతంలోకి వెళ్లి చూడాలి. హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ముందు చంద్రబాబు నాయుడు చేరదీశారు. తమ బంధువుల కుటుంబానికి చెందిన ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చి వివాహం జరిపించడంలో చంద్రబాబు బాగా చొరవ తీసుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేసి.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఖమ్మం వద్ద జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని నెలలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
అలా.. ఇరు కుటుంబాల మధ్య మొదలైన అంతరం..
ఇక్కడి వరకూ.. ఇటు బాలకృష్ణ-చంద్రబాబు కుటుంబం, అటు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం మధ్య ఎలాంటి అపోహలు లేవు. ఆ తర్వాతి కాలంలో, ఇరు కుటుంబాల మధ్య రాజకీయ కోణం జోడవ్వడంతోనే అంతరానికి బీజం పడింది. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని, తన తాత ఎన్టీఆర్‌కు ఏదో ఒకరోజు తాను రాజకీయ వారసుడిని అవుతానని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని.. ఆయన్ను అభిమానించే వారు విస్తృతంగా భావించటం, వ్యాఖ్యానించడం మొదలయ్యింది. ఇక్కడే ఇరు కుటుంబాల మధ్య అంతరం మొదలయ్యింది.
అగాధం పెంచిన జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు..
చంద్రబాబు తనయుడు, బాలకృష్ణకు అల్లుడు అయిన లోకేష్‌ను తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే విధంగా తీసుకున్న పలు నిర్ణయాలు.. ఈ అంతరానికి ఆజ్యం పోసినట్లయింది. జూనియర్ ఎన్టీఆర్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా, ఎన్టీఆర్ వారసుడిగా ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు సందర్భాల్లో ఫ్లెక్సీలు పెడుతుండటంతో.. ఈ అంతరం రానురానూ అగాధంగా మారుతూ వస్తోంది. చివరికి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా.. ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలవడంతో, అనుమానాలు బలపడుతూ వస్తున్నాయి.
ఇంత జరిగినా.. నోరు మెదపని జూనియర్ ఎన్టీఆర్..
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం ఓ ఏడాదిన్నర క్రితం నిర్ణయం తీసుకొన్నప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్ కొంత స్పందించినప్పటికీ… ఆయన స్పందించిన తీరు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పెద్దగా రుచించలేదు. ఇక.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు కుటుంబానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత అంశాలు ప్రస్తావనకు వచ్చి.. చాలా రచ్చ జరిగినప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం స్పందించలేదని.. తెలుగుదేశం పార్టీ వారు బాగా నొచ్చుకున్నారు. ఆ సందర్భంలో.. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పలువురు బహిరంగంగా ముందుకు వచ్చి… చంద్రబాబు కుటుంబానికి తమ పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు.
చంద్రబాబు అరెస్ట్ అయినా..
ఇవన్నీ ఒక ఎత్తయితే… చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి, 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉంచిన సందర్భంలో… జూనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పలువురితో పాటు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆశించారు. ఈ అంశంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏమాత్రం స్పందన రాకపోవడంతో… ఇటు చంద్రబాబు కుటుంబానికి, బాలకృష్ణ కుటుంబానికీ, తెలుగుదేశం పార్టీలోని పలువురు నాయకులకూ జూనియర్ ఎన్టీఆర్ పట్ల పూర్తిస్థాయిలో అసంతృప్తి పేరుకుపోయింది.
వైసీపీ నాయకులతో సాన్నిహిత్యం..
ఇవి చాలవా అన్నట్లు.. చంద్రబాబు నాయుడు కుటుంబంపై రాజకీయంగా నిప్పులు చెరుగుతున్న కొందరు వైసీపీ పార్టీ నాయకులతో.. జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందన్న అభిప్రాయం లేదా అపోహ చాలాకాలంగా బలంగా ఉండటం వల్ల కూడా.. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు జఠిలంగా మారాయి. ఆ నాయకులు ఓవైపు జూనియర్ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ.. లోకేష్‌పై తిట్ల వర్షం కురిపిస్తూ, ఇద్దరి మధ్య పోలికల ప్రస్తావన తేవడంతో.. ఒక రకంగా ఇది.. అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే ఈ పరిణామాలన్నింటిపైనా.. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులతోపాటు, ఆయనకు భారీ సంఖ్యలో ఉన్న అభిమాన గణం వాదన, అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
లోకేశ్ కోసమే దూరం పెట్టారా?
తెలుగుదేశానికి మద్దతుగా 2009లో విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను కావాలనే చంద్రబాబునాయుడు కుటుంబం పక్కన పెట్టిందని.. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు బలంగా నమ్ముతారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అడ్డు పడతాడోనన్న అనుమానంతోనే చంద్రబాబునాయుడు కుటుంబం జూనియర్ ఎన్టీఆర్‌ను కావాలని దూరంగా పెట్టిందని ఆయన అభిమానులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు.
ఇది నిజమా.. అబద్ధమా.. అనే అంశం కంటే.. దీనికి సంబంధించి ఇరుపక్షాల్లో ప్రబలంగా నాటుకుపోయిన భిన్నాభిప్రాయాలు, అపోహలే వారి మధ్య అంతరం రానురాను పెరిగిపోవడానికి దారితీస్తున్నాయి. ఈ అపోహలను సరిదిద్ది, ఇరు కుటుంబాలను కలిపి, ఒక వేదిక మీదికి తెచ్చే గట్టి ప్రయత్నం.. వారిద్దరికీ సన్నిహితులైన వారెవరైనా చేశారా.. అంటే, అనుమానమే!
ఎన్టీఆర్ ఘాట్.. ప్రజల ఆస్తి
మొత్తంమీద.. గడచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్న పలు పరిణామాలే.. తాజాగా ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను తొలగించడానికి దారితీసింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఎన్టీఆర్ ఘాట్ అనేది ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఆస్తి ఏమాత్రం కాదు. ప్రజానాయకుడిగా, తెలుగు జాతికి వెలుగు తెచ్చిన ఓ నాయకుడికి స్మృతిగా ఎన్టీఆర్ ఘాట్‌ను ప్రభుత్వం అనుమతించింది. అది ప్రజలందరికీ చెందిన ఆస్తి. అక్కడ ఎన్టీఆర్ కుటుంబంతో సహా.. ఏ ఒక్కరికీ ప్రత్యేక హక్కులు ఉండవు. అక్కడికి ఎవరైనా వెళ్లి నివాళులు అర్పించవచ్చు. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పు అయితే.. అది కూడా అందరికీ వరిస్తుంది. కొంచెం సెన్సిటివ్‌గా అనిపిస్తున్నా.. ఇది కఠోర వాస్తవం.
తోడుగా ఉన్నది అతనొక్కడే..
ఏదిఏమైనా.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో ఇప్పుడు చోటుచేసుకున్న పరిణామం.. మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. దివంగత ఎన్టీఆర్ కుటుంబంలో భాగమైన విస్తృత కుటుంబ సభ్యుల్లో.. హరికృష్ణ మరో కుమారుడైన కళ్యాణ్‌రామ్ ఒక్కరే జూనియర్ ఎన్టీఆర్‌తో బహిరంగంగా కలిసిమెలిసి ఉంటున్నారు. కళ్యాణ్‌రామ్ కూడా సినిమా హీరో కావడంతో.. ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు కళ్యాణ్‌రామ్ పలు సినిమా ఫంక్షన్లలో ఒకే వేదికపై కలిసి ఉండటంతోపాటు, ఒకరికిమరొకరు మద్దతుగా మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మిగతా సభ్యులంతా.. అటు చంద్రబాబు, బాలకృష్ణలకు మద్దతుగా ఉండటమో, లేదా ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఉండటమో జరుగుతోంది.