మేము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చు.. కానీ..: హోంమంత్రి అనిత

ఏపీకి పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ లేదని అనిత చెప్పారు.

మేము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చు.. కానీ..: హోంమంత్రి అనిత

AP Home Minister Vangalapudi Anitha Warning

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు గెలిచిందని, తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అయితే రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని, సరిగ్గా పనిచేయని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కక్షలు, దాడులు, అరెస్టులు సరికాదని అనిత తెలిపారు. పోలీసులు రాజకీయాలు చేయవద్దని అన్నారు. ఖాకీ చొక్కాలు వేసుకున్న వాళ్లు రాజకీయాలు చేయాలంటే ఖద్దరు చొక్కా వేసుకోవాలని చెప్పారు. అన్ని అక్రమ కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.

ఏపీకి పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ లేదని అనిత చెప్పారు. వాటి కోసం కేంద్ర సర్కారు నిధులు పంపినప్పటికీ వాటిని వినియోగించలేదని తెలిపారు. నూతన ఎస్పీ ఆఫీసులకు సొంత భవనాలు లేవని చెప్పారు. కేంద్ర సర్కారు నుంచి గత ఐదు సంవత్సరాల్లో 250 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.

తాకట్టులో విశాఖ సీపీ ఆఫీస్
పోలీస్ వెహికల్స్ 2014లో ఇచ్చారని, గత ఐదేళ్లలో మెయింటేనెన్స్ కూడా లేదని అనిత చెప్పారు. పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్స్ చేయాలని అన్నారు. గత ఐదేళ్లుగా కానిస్టేబుల్, హోమ్ గార్డుల నియామకాలు లేవని చెప్పారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదని తెలిపారు. మహిళల అదృశ్య కేసులు పెరిగాయని చెప్పారు. సచివాలయ మహిళా పోలీసులకు ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. విశాఖ సీపీ ఆఫీస్ తాకట్టులో ఉందని చెప్పారు.

Also Read: సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?