Vijayawada Mayor Seat : బెజవాడ మేయర్ బరిలోకి వంగవీటి రాధా? జనసేన నుంచి పోటీకి చాన్స్..! తెలుగు తమ్ముళ్ల పరిస్థితేంటి?
Vijayawada Mayor Seat : విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన పార్టీ తరపున వంగవీటి రాధా బరిలోకి దిగేందుకు లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
Vangaveeti Radha
Vijayawada Mayor Seat : పురపోరు షెడ్యూల్ రాబోతున్న వేళ ఏపీ రాజకీయం వెరీ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కూటమిలో అయితే సీట్ల పంపకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మేయర్ సీట్ల పంపకాలు అంటూ జరుగుతున్న ప్రచారంతో.. కొత్త కొత్త ఈక్వేషన్స్ తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేనకు మూడు కీలక కార్పొరేషన్ సీట్లను కేటాయించారని టాక్ నడుస్తోంది.
విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ మేయర్ సీట్లలో జనసేన పోటీ చేయడం ఖాయమంటున్నారు. మచిలీపట్నం, కాకినాడలో జనసేన సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. పైగా ఆ రెండు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండటంతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట. ఇక బెజవాడకు వచ్చేసరికి సీన్ మరోలా ఉందంటున్నారు. ఇక్కడ జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో.. పవన్ కల్యాణ్ పట్టుబట్టి మరి తమకు మేయర్ పీఠం తీసుకున్నారని చెబుతున్నారు.
ఇంత వరకు బానే ఉన్నా బెజవాడ జనసేన మేయర్ క్యాండిడేట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలో మేయర్ సీటు కోసం జరుగుతున్న పోటీ ఇంట్రెస్టింగ్గా మార్చేస్తోంది. ఇప్పటికే ఈ సీటుపై ఆరేడు మంది నేతలు కన్నేయగా, ప్రముఖ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫ్యామిలీ రేసులోకి వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్ కాబోతుందన్న ఎదురుచూపులు ఓ వైపు.. బెజవాడ మేయర్ పీఠం జనసేన కేటాయించారన్న టాక్ మరోవైపు నడుస్తున్న టైమ్‌లో వంగవీటి రాధా పేరు లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
వంగవీటి రాధా ఆ మధ్య సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వేర్వేరుగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమే అంటూ బయటకు చెప్పినా, పక్కా రాజకీయ వ్యూహం ఉందని ప్రచారం అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఇటు చంద్రబాబు, అటు పవన్ రాధాను కోరినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాధాను జనసేన మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించుతారని అంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అండర్ స్టాండింగ్తోనే రాధా పేరు తెరపైకి వచ్చిందని చర్చించుకుంటున్నారు. దీంతో రాధా జనసేన కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది.
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా లేదంటే ఆయన భార్య పుష్పవల్లి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. రాధా 2019 నుంచి టీడీపీలో ఉండగా, ఆయన భార్య పుష్పవల్లి తల్లిదండ్రులు ఇద్దరూ జనసేనలో క్రియాశీలంగా పనిచేస్తున్నారని అంటున్నారు. దీంతో ఆ కుటుంబంపై రెండు పార్టీల్లో ఏకాభిప్రాయం, సానుకూలత ఉందని ప్రచారం జరుగుతోంది. రేపోమాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారం వేళ..ఆల్ ఆఫ్ సడెన్‌గా రాధా సతీమణి పుష్పవల్లి విజయవాడ సెంట్రల్ పరిధిలో ఓటు హక్కు నమోదు చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది.
రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహమై చాలా కాలం అయినప్పటికీ, ఇప్పుడే ఓటు నమోదు చేసుకోవడం వెనుక మేయర్‌గా పోటీ చేసే ఆలోచన ఉందని అంటున్నారు. రాధా లేకపోతే ఆయన భార్య పోటీ చేయడం పక్కా అని గుసగుసలు బయలుదేరాయి. పోయినసారి బీసీ మహిళకు రిజర్వ్ చేసినందున ఈ సారి విజయవాడ మేయర్ పీఠం జనరల్ రిజర్వ్ అయింది. ప్రత్యక్ష విధానంలో ఎన్నిక జరగబోతున్నందున విజయవాడ నగరంపై పట్టు ఉండే బలమైన నేత కోసం జనసేన సెర్చ్ చేస్తుండగా వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చిందని అంటున్నారు.
విజయవాడ మేయర్ పీఠం జనసేనకు కేటాయిస్తే తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. వాస్తవానికి విజయవాడలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఈ క్రమంలో తమకే మేయర్ పీఠం దక్కుతుందని ఆశించారు తెలుగు తమ్ముళ్లు. బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ తోపాటు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ, గన్నే వెంకట నారాయణ ప్రసాద్, బొప్పన భవకుమార్, ముమ్మనేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, కోగంటి రామారావు, దేవినేని అపర్ణ, కోనేరు రమాదేవి, చెన్నుపాటి ఉషారాణి, గద్దె అనురాధ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.
ఇప్పుడేమో కూటమిలో సీట్ల పంపకాలు, పొలిటికల్ ఈక్వేషన్లు వేగంగా మారిపోతుండటంతో..టీడీపీలోని ఆశావహుల పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. వీళ్లంత సహకరించి.. హర్ట్ ఫుల్‌గా పనిచేస్తేనే బెజవాడ మేయర్ పీఠాన్ని కూటమి ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అధిష్టానం ఎలా సర్ధిచెప్పబోతుందో..? విజయవాడ మేయర్ బరిలో రాధా నిలుస్తారో లేక ఆయన సతీమణి కంటెస్ట్ చేస్తారో వేచి చూడాలి మరి.
