AP Weather : దూసుకొస్తున్న అల్పపీడనం..! ఏపీలో మారుతున్న వాతావరణం.. ఈ జిల్లాల్లో 4రోజులు దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు..
AP Weather : ఏపీలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత వారంరోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
AP Weather
AP Weather : ఏపీలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత వారంరోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఎండల తీవ్రతతోపాటు.. ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకొనేందుకు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 (మంగళవారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో.. ముఖ్యంగా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చురుగ్గా సాగుతుండగా రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు మొదలయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏపీ, యానాంలలో రోబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మంగళవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధవారం రాయలసీమలోని కొన్ని చోట్ల, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని సూచించారు.
