వెంకటగిరిలో వైసీపీని కలవరపెడుతున్న వర్గపోరు

అసంతృప్తితో ఉన్న క్యాడర్ ఆయనకు సహకరిస్తుందా ? ఈ వర్గ విభేదాలు వెంకటగిరిలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వెంకటగిరిలో వైసీపీని కలవరపెడుతున్న వర్గపోరు

Venkatagiri YCP Politics

Updated On : January 16, 2024 / 1:29 AM IST

Venkatagiri YCP Politics : తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజవకర్గంలో వైసీపీకి ముగ్గురు కీలక నేతలున్నారు. ముగ్గురి పేర్లూ రామ అన్నపదంతోనే మొదలవుతాయి. కానీ.. ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. ఇందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే.. మరొకరు పార్టీ ఇన్‌చార్జి. ఇంకొకరు పార్టీలో తొలి నుంచీ ఉన్న కీలక నాయకుడు. ఈ ముగ్గురూ మూడు వర్గాలుగా విడిపోవడంతో వెంకటగిరి వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. మరోవైపు ఇన్‌చార్జి ఏకపక్ష తీరు నియోజకవర్గంలో పార్టీకి చేటు తెస్తుందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

కలరవపెడుతున్న వర్గ విభేదాలు
వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీని వర్గ విభేదాలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆనం వ్యవహార శైలి నచ్చకపోవడంతో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు సీఎం జగన్. అప్పటి నుంచి రామ్‌కుమార్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! 

పార్టీ నష్టపోతుందని తీవ్ర ఆవేదన..
వైసీపీలో ఎక్కువ శాతం ఆనం రామనారాయణరెడ్డి వెంటే ఉండటంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. రామ్‌కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోడంతో చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. అంతేకాదు.. ఏకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ రామ్‌కుమార్ వ్యవహారంపై మండిపడుతున్నారు వారంతా. ఇదిలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు.

తీవ్ర ఆవేదనలో రాంప్రసాద్ రెడ్డి..
ఇక.. వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఇక్కడ మరో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. రామ్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత రాంప్రసాద్ రెడ్డికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరోవైపు కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా ఆయనకు ఆగ్రహం తెప్పించింది. రామ్‌కుమార్‌ను నియోజకవర్గం మొత్తానికి సమన్వయకర్తగా నియమిస్తే.. ఆయన కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సబబని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు

రెండు మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న రామ్‌కుమార్‌రెడ్డికే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఆయనకు కిందిస్థాయి నేతల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న క్యాడర్ ఆయనకు సహకరిస్తుందా ? ఈ వర్గ విభేదాలు వెంకటగిరిలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.