వైఎస్‌ జగన్ షేర్ల బదిలీ పిటిషన్.. NCLTలో విచారణ వేళ విజయమ్మ, షర్మిల ఏం కోరారంటే?

విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

వైఎస్‌ జగన్ షేర్ల బదిలీ పిటిషన్.. NCLTలో విచారణ వేళ విజయమ్మ, షర్మిల ఏం కోరారంటే?

Updated On : February 10, 2025 / 7:44 PM IST

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఇవాళ విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను కొంతకాలం క్రితం జగన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇందులో తన తల్లి విజయమ్మతో పాటు సోదరి షర్మిలను ప్రతివాదులుగా ఆయన పేర్కొనడం సంచలనం సృష్టించింది.

జగన్, విజయమ్మ, షర్మిల ఆస్తుల పంపకాలపై ఎన్సీఎల్టీలో ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఎన్సీఎల్టీ మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: హై అలర్ట్.. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ.. చికెన్ తినడం తగ్గించాలి.. ఆ షాపులు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

కాగా, షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విచారణ జరుగుతోంది. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్‌లో జగన్‌ కోరారు. వైఎస్ విజయమ్మ, షర్మిల, సండూర్ పవర్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కాగా, జగన్ తన పిటిషన్‌లో కీలక విషయాలు చెప్పారు. తనకు చెప్పకుండా విజయమ్మ, షర్మిల షేర్లు బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. షేర్ల బదిలీ పత్రాలు సమర్పించకుండానే మార్చుకున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీల పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని పేర్కొన్నారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా ఉండాలని కోరారు.